తాజా వార్తలు

Saturday, 24 October 2015

ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఛార్జీల మోతఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఆర్టీసీ ఛార్జీల మోత మోగింది. ఏకంగా చార్జీలను పదిశాతం పెంచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఆఘమేఘాల మీద ఛార్జీలను వడ్డించేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమైపోయింది. పెంచిన చార్జీలు గత అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చేశాయి.
ఇప్పటికే నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తున్న వేళ ఏపీ ప్రజల నెత్తిపై మరో బాంబు పడింది. ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నష్టాల భారంతోనే నెట్టుకొస్తున్న సంస్ధకు గత ఆర్ధిక సంవత్సరంలో 590 కోట్ల రూపాయలు నష్టపోయింది. దీనికి తోడు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కార్మికులు పట్టుబట్టి పంతం నెగ్గించుకున్నారు. దీంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టైంది. సంస్థ నష్టాల ఊబిలో చిక్కుకుని మరింత లోతుకు దిగజారింది. కోలుకోలేని విధంగా లాస్‌ పెరిపోవడంతో 20 శాతం ఛార్జీలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. పదిశాతానికి మాత్రమే సర్కారు నుంచి అనుమతి లభించింది. 
పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు మూడు పైసలు  పెంచారు. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో 8 పైసలు, సూపర్‌ లగ్జరీ, వెన్నెల, గరుడ బస్సుల్లో కిలోమీటర్‌కు 9 పైసలు రేటు పెంచారు. పెంచిన ధరల ప్రకారం విజయవాడ- హైదరాబాద్ మధ్య ఎక్స్‌ప్రెస్‌ చార్జీ 213 నుంచి 235 రూపాయలైంది. డీలక్స్‌ ఛార్జీ 240 నుంచి 264 రూపాయలైంది. పెరిగిన ఛార్జీలతో ఆర్టీసీకి 300 కోట్ల రూపాయల లాభం చేకూరనుంది. అయినా ఇంకా 330 కోట్ల లాస్‌లోనే ఉంది. 
ఆర్టీసీని నష్టాలబారి నుంచి గట్టెక్కించేందుకు బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు ఎండీ సాంబశివరావు. త్వరలోనే ఈ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు. ఛార్జీల పెంపుతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలపై, కాలేజీ విద్యార్ధులపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  పల్లెవెలుగు బస్సులు, బస్‌పాస్‌ల ఛార్జీలను యధాతధంగా ఉంచింది.
News Desk.
« PREV
NEXT »

No comments

Post a Comment