తాజా వార్తలు

Friday, 2 October 2015

క‌డ‌ప జిల్లా తేదేపాలో తీవ్రమైన ముస‌లం....???క‌డ‌ప‌జిల్లా, జ‌మ్మల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేర‌డంపై ఒక నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు, ఆయ‌న చేరిక‌ దాదాపు ఖాయ‌మైపోయిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ విష‌యంపై ఆయ‌న, తేదేపా ల మ‌ధ్య తుది ఒప్పందం కుదిరిన‌ట్టు వార్తలు వెలువ‌డిన మ‌రుక్షణ‌మే... క‌డ‌ప జిల్లా తేదేపాలో తీవ్రమైన ముస‌లం మొద‌లైంది.
ముఖ్యంగా ఆదినారాయ‌ణ‌రెడ్డికి ఆది నుంచీ ప‌క్కలో బ‌ల్లెంలా వ్యవ‌హ‌రిస్తూ వ‌చ్చిన తెదేపా స్థానిక అధ్యక్షుడు రామ‌సుబ్బారెడ్డి... ఈ చేరిక‌ను జీర్ణించుకోలేక‌పోతున్నాడు. ఎమ్మెల్యే చేరిక ఖ‌రారైన విష‌యం తెలియ‌గానే ఆయ‌న హ‌డావిడిగా చిన‌బాబు లోకేష్‌తో పాటు బాల‌కృష్ణ‌ను కూడా క‌లిసి త‌న ఆందోళ‌న‌ను వెళ్లగ‌క్కార‌ని స‌మాచారం.
త‌మ కుటుంబం 1983 నుంచీ తేదేపానే న‌మ్ముకుని ఉంద‌ని, వైఎస్ అధికారంలోకి వ‌చ్చిన ప‌దేళ్లూ ఎన్నో క‌ష్టన‌ష్టాల‌కు ఓర్చుకుని మ‌రీ పార్టీని జిల్లాలో బ‌తికించామ‌ని ఆయ‌న చెప్పిన‌ట్టు తెలిసింది. పార్టీ త‌ర‌పున జ‌రిగిన గొడ‌వ‌ల్లో దాదాపు 150 మందిని పోగొట్టుకున్నాన‌ని ఆవేద‌న వ్యక్తం చేశాడ‌ట‌.
ఇంత‌కాలంగా పార్టీని న‌మ్ముకుని తాముంటే, అధికారం వ‌చ్చిన వెంట‌నే త‌మ పార్టీలోకి రావాల‌నుకుంటున్న ప్రత్యర్దుల‌ను ఎలా చేర్చుకుంటార‌ని గ‌ట్టిగా అడిగిన‌ట్టు తెలిసింది. త‌మ‌ ఆలోచ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా ఆదినారాయ‌ణ‌రెడ్డిని తీసుకుంటే అంగీక‌రించే ప్రశ్నే లేద‌ని స్పష్టం చేశాడాయ‌న‌.
అయితే రామ‌సుబ్బారెడ్డి ఆవేద‌న‌ను లోకేష్‌, బాల‌కృష్ణలు ఎంత మాత్రం ప‌ట్టించుకోలేద‌ని స‌మాచారం. ఆదినారాయ‌ణ‌రెడ్డిని తీసుకోక త‌ప్పద‌ని, పార్టీ బ‌లోపేతానికి అవ‌స‌రం బ‌ట్టి త్యాగాలు చేయాల్సిందేన‌ని వీరు రామసుబ్బారెడ్డికి స్పష్టం చేశార‌ట‌. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా అనంత‌పురం జిల్లాలో జెసి దివాక‌ర్‌రెడ్డి తెదేపాలోకి రావడం, త‌ద్వారా అక్కడ తెలుగుదేశం గ‌ణ‌నీయ‌మైన సంఖ్యలో విజ‌యాలు ద‌క్కించుకోవ‌డాన్ని ప్రస్తావించార‌ని తెలిసింది.
జెసి రాక‌ను సైతం అప్పట్లో ప‌లువురు నేత‌లు వ్యతిరేకించార‌ని గుర్తు చేశార‌ట‌. రెండు మార్లు సీటిచ్చినా పార్టీని గెలిపించ‌లేక‌పోయావంటూ రామ‌సుబ్బారెడ్డిని త‌ప్పుప‌ట్టార‌ట‌. ఆది చేరిక కార‌ణంగా క‌డ‌ప‌జిల్లాలో పార్టీకి మంచి ప‌ట్టు సాధించే అవ‌కాశం వ‌స్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. అయితే తాను దీనికి అంగీక‌రించేది లేదన్న మాట‌కే క‌ట్టుబ‌డిన రామ‌సుబ్బారెడ్డి చివ‌రిసారిగా చంద్రబాబును క‌లిసి ఆపైన త‌న‌దారి తాను చూసుకుందామ‌ని నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది.
Political Desk
« PREV
NEXT »

No comments

Post a Comment