తాజా వార్తలు

Sunday, 11 October 2015

టీఎస్‌పీఎస్సీలోఆరుగురు కొత్త సభ్యులు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆరుగురు కొత్త సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశాలు ఇచ్చారు. నూతన సభ్యుల్లో తడకమళ్ల వివేక్, డీ కృష్ణారెడ్డి, డాక్టర్ కే రామ్మోహన్ రెడ్డి, మంగారి రాజేందర్, సీహెచ్ విద్యాసాగర్‌రావు, ప్రొఫెసర్ సీహెచ్ సాయిలు ఉన్నారు. వీరు ఈ పదవిలో ఆరేండ్లు లేదా 62 ఏండ్లు వయసు నిండే వరకు కొనసాగుతారు. దీంతో టీఎస్ పీఎస్సీలో మొత్తం సభ్యుల సంఖ్యం 9కి చేరింది. సీఎం కేసీఆర్ తనను ఎంపికచేయడం పట్ల డీ కృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని జలాల్‌పూర్ గ్రామం. ప్రస్తుతం కో ఆపరేటివ్ సొసైటీస్/ మెంబర్, కో ఆపరేటివ్ ట్రిబ్యునల్ అడిషనల్ రిజిస్ట్రార్‌గా ఉన్నారు. భవిష్యత్ తెలంగాణ ప్రజానీకానికి సేవ చేసే ప్రభుత్వ ఉద్యోగుల నియామకంలో కీలకమైన బాధ్యత దక్కడం ఆనందకరమని, ఈ అవకాశంతో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామినవుతానని ఆయన చెప్పారు. తన నియామకం ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందని మరో నూతన సభ్యుడు సీహెచ్ విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించారు. ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్‌లో డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన విద్యాసాగర్‌రావుది కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామం. తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశంతో తెలంగాణ యువతకు న్యాయం చేస్తానని ఆయన తెలిపారు.  ముఖ్యమంత్రి ఎంతో నమ్మకంతో తనకు బాధ్యతలు అప్పగించారని సభ్యుడిగా ఎంపికైన తడకమళ్ల వివేక్ ఆనందం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నియామక ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగుల ఎంపికలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానన్నారు. వివేక్ 1983 గ్రూప్ 1 టాపర్. కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ వ్యాట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఉద్యోగుల తరఫున కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన ప్రతినిధి బృందంలో సభ్యులుగా పనిచేశారు. అకడమిక్ విభాగంలో సేవలందించిన తనకు ఉద్యోగుల ఎంపికలో భాగస్వామ్యం కల్పించడం సంతోషకరమని చింత సాయిలు అన్నారు. కెమికల్ ఇంజినీరింగ్‌లో ప్రొఫెసర్ అయిన సాయిలు ఓయూ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో పనిచేశారు. కొత్త విధుల్లోనూ తన బాధ్యతను రాజ్యంగపరమైన కోణంలో సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు.  

« PREV
NEXT »

No comments

Post a Comment