తాజా వార్తలు

Tuesday, 20 October 2015

విభజన పాపం చేసిన బాబుకి ప్రతిపక్ష నేతను పిలిచే నైతిక హక్కు ఎక్కడుంది...?విభజన పాపం కాంగ్రెస్‌ పార్టీదే. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత పరిస్థితి కారణం కాంగ్రెస్‌ పార్టీనే. కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా విభజించింది. ఆ పార్టీ ఇప్పుడు రాజకీయ కారణాలతో విమర్శలు చేస్తోంది. అమరావతిలో రాజధానికి అడ్డంకులు సృష్టించింది. అన్ని విధాలా ఆంధ్రప్రదేశ్‌ని నాశనం చేసింది..' అంటూ విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. 
నిజమే, కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయింది. కానీ, అలా విడిపోవడానికి చంద్రబాబు తనవంతు సహాయ సహకారాలు అందించారా? లేదా? 'రాష్ట్ర విభజనకు మేం అనుకూలం' అని చంద్రబాబు, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేఖ రాశారా? లేదా? అలా లేఖ రాసినప్పుడే, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని గురించి మాట్లాడి వుంటే ఇప్పుడీ దుస్థితి దాపురించేది కాదు. 
అప్పట్లో రాజకీయ అవసరాల కోసం తప్పితే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోతుందని ఆలోచించి చంద్రబాబు ఏమీ విభజనకు అనుకూలంగా మాట్లాడలేదు. చంద్రబాబు లేఖని పట్టుకుని, కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని విభజించి పారేసింది. విభజన తప్పదని తెలిశాక, అమాయకంగా 'ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చెయ్యండి..' అంటూ చంద్రబాబు నానా యాగీ చేశారు. పాలన చివరి రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ హడావిడిగా విభజన వ్యవహారాన్ని చక్కబెట్టేసింది. 
ఇదీ అసలు జరిగిన తంతు. పోనీ, విడిపోయాక అయినా కేంద్రాన్ని (తాము అధికారం పంచుకుంటున్న ప్రభుత్వాన్ని) ప్రశ్నించి, ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు సాధించారా? అంటే అదీ లేదు. కేంద్రాన్ని గట్టిగా అడిగితే, ఎక్కడ తాను ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోతానోనన్న భయం చంద్రబాబుది. కేంద్రం సహాయ సహకారాలు అందించకపోతే, తన పాలనకు అర్థం వుండదన్న విషయమూ చంద్రబాబుకి తెలుసు. అందుకే, అటు కేంద్రాన్ని ఏమీ అనలేక, గతాన్ని పదే పదే తవ్వితీస్తూ, కాంగ్రెస్‌పైకి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 
'అమరావతి శంకుస్థాపన శుభ సమయంలో రాజకీయ విమర్శలు చేయదలచుకోలేదు..' అంటూనే కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోస్తూ, తన జీవితంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని చూడలేదంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌పైనా మండిపడ్డారు చంద్రబాబు. భూమి పూజకి ప్రతిపక్షాల్ని ఆహ్వానించకుండా తనే అన్నీ చక్కబెట్టేసుకున్న చంద్రబాబు, శంకుస్థాపనకు మాత్రం 'రావల్సిందిగా' ఆహ్వానం పంపితే ఎలా కుదురుతుంది.? పైగా, ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిన ప్రతిపక్ష నేత వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళని చంద్రబాబుకి, అమరావతి ఆహ్వానం పేరుతో ప్రతిపక్ష నేతను పిలిచే నైతిక హక్కు ఎక్కడుంది.?
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment