తాజా వార్తలు

Thursday, 26 November 2015

15-20వేల టీచర్ పోస్టులు

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు మొదలుపెట్టారు. 15వేల నుంచి 20వేల వరకూ టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో గురువారం డీఈవోలతో శాఖ డైరెక్టర్ జీ కిషన్ సమావేశమై సమీక్షించారు. శుక్రవారం ఉదయం 11 గంటలవరకు జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను తక్షణమే పంపించాల్సిందిగా ఆయన ఆదేశించారు.  డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి డీఎస్సీ నోటిఫికేషన్ అంశంపై విద్యాశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ డైరెక్టర్ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మార్చి 2016 కటాఫ్ నాటికి ఉన్న ఖాళీలన్నింటినీ విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపుతున్నట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. తాజా లెక్కల ప్రకారం దాదాపు 15వేలనుంచి 20వేలమధ్య టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుందని డీఈవోల సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులందరికీ చదవడం, రాయడం కచ్చితంగా రావాలని, అందుకోసం ప్రతి రోజూ రెండు గంటలు అదనంగా కష్టపడాలని డీఈవోలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. అందుకోసం డిసెంబర్ 31లోగా గడువు విధించామన్నారు. డిసెంబర్ 31లోగా డీఈవోలు ప్రగతి చూపించాలని కోరారు. అలాగే ప్రైవేటు స్కూళ్లలో సీసీఈ విధానం అమలు తీరుపై సమీక్ష నిర్వహించాలన్నారు. జిల్లాలవారీగా కమిటీలు వేసుకొని, ప్రతి ఒక్కరూ నాలుగు స్కూళ్లకు తక్కువ కాకుండా పర్యవేక్షించాలని విద్యాశాఖ డైరెక్టర్ లను ఆదేశించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment