తాజా వార్తలు

Thursday, 12 November 2015

మరో విదేశీ టూర్

ప్రధాని నరేంద్రమోడీ మరో విదేశీ పర్యటనకు బయలు దేరారు. బ్రిటన్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలువురు నేతలు, అధికారులతో సమావేశం కానున్నారు. ఆయన ప్రధాని అయిన తర్వాత ఇంగ్లాండ్‌లో జరిగే మొట్టమొదటి ద్వైపాక్షిక సమావేశమిది. తొమ్మిది సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఇంగ్లాండ్‌తో ద్వైపాక్షిక జరిగే సమావేశాలకు వెళ్లడం ఇదే ప్రథమం. 2006లో మన్మోహన్‌సింగ్‌ బ్రిటన్‌లో పర్యటించారు. పెట్టుబడులు, రక్షణ రంగాలకు సంబంధించి మోడీ బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌తో సమావేశమవుతారు. సుమారు 18 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. లండన్‌లో పలువురు ప్రముఖులతోనూ మోడీ రౌండ్ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఇంగ్లాండ్‌లోని ఎన్‌ఆర్‌ఐలతో సమావేశమై భారత్‌లో పెట్టుబడులు పెట్టమని స్వాగతించే అవకాశముంది. ఇరుదేశాల మధ్య రక్షణ పరంగా సాంప్రదాయకంగా కొనసాగుతున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తామని, తయారీరంగంపై ప్రధానంగా దృష్టిపెడతామని మోడీ ఇప్పటికే ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. జి-7 కంట్రీస్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న, బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఇంగ్లాండని వ్యాఖ్యానించారు. తన పర్యటన ద్వారా ఆర్థిక వ్యాపార రంగాల్లో ఇంగ్లాండ్‌తో బంధం బలోపేతమయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇదే పర్యటనలో మోడీ బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. ఒక ఇండియన్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ ఇంగ్లాండ్ చట్టసభలో ప్రసంగించడం ఇదే ప్రథమమవుతుందని విదేశీ కార్యదర్శి ఎస్‌.జైశంకర్‌ అభిప్రాయపడ్డారు. క్వీన్‌ ఎలిజెబెత్‌తో బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో మోడీ విందులో పాల్గొంటారు. ఆ దేశ పార్లమెంట్ వద్దనున్న మహాత్మాగాంధి విగ్రహానికి ప్రధాని నివాళులర్పించనున్నారు. దీనితోపాటు లండన్‌లో అంబేద్కర్‌ నివసించిన ఇంటిని మోడీ సందర్శిస్తారు. బ్రిటన్‌ పర్యటన అనంతరం ప్రధాని టర్కీలో జరిగే జి-20 సమావేశాలకు వెళ్తారు. నవంబర్‌ 14న ఆ సమావేశాల్లో పాల్గొంటారు. మొత్తంగా ప్రధాని ఇంగ్లాండ్‌ పర్యటనతో దేశానికి ఏరకమైన ప్రయోజనాలు కలగబోతున్నాయన్నది వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment