తాజా వార్తలు

Saturday, 14 November 2015

పూర్తిస్థాయి డీజీపీగా అనురాగ్‌శర్మ

ఏడాదిన్నరగా కొనసాగిన రాష్ట్ర డీజీపీ ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా ప్రస్తుత ఇన్‌చార్జి డీజీపీ అనురాగ్‌శర్మ పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు.  డీజీపీ ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్‌ల పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి పంపించింది. ఇందులో ముగ్గురు..అరుణా బహుగుణ, ఏకేఖాన్, అనురాగ్ శర్మ పేర్లను ఎంపిక చేసిన యూపీఎస్సీ రాష్ర్టానికి ఆ షార్ట్ లిస్ట్‌ను పంపించింది. ఈ ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించుకునే విచక్షణ అధికారాన్ని వినియోగించుకుని సీఎం కేసీఆర్ ప్రస్తుత ఇన్‌చార్జి డీజీపీ అనురాగ్‌శర్మను ఎంచుకున్నారు. దీనితో పూర్తి స్థాయి డీజీపీ ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఈ మేరకు నియామక ఉత్తర్వులు విడుదల చేశారు. తాత్కాలిక డీజీపీ హోదా నుంచి పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించాలని సూచించారు. ఈ ఆదేశాలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి రాష్ట్ర పోలీస్ శాఖ చక్కని పనితీరుతో దేశవ్యాప్తంగా మంచిపేరు తెచ్చుకుంది. ఇన్‌చార్జి డీజీపీ హోదాలో అనురాగ్‌శర్మ ఇందుకోసం తీవ్రంగా కృషి చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పూర్తిస్థాయి ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌కు నూతన వాహనాలు సమకూర్చారు. టెక్నాలజీపరంగా ప్రతి అధికారి శిక్షణ పొంది ప్రావీణ్యం చూపేలా కార్యాచరణ అమలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గోదావరి పుష్కరాలను ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు లేకుండా సక్సెస్ చేసి శభాష్ అనిపించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న మాడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ నిధులు దాదాపు రూ.160 కోట్లు తీసుకువచ్చి పోలీస్‌స్టేషన్ల ఆధునీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుతో పోలీస్ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చి, అత్యాధునికమైన ఆయుధాలను కొనుగోలు చేశారు. జంట కమిషనరేట్లను స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా మార్చటంలో ప్రతిభ ప్రదర్శించారు. తెలంగాణ పోలీస్ క్రీడాకారులను ప్రోత్సహించి మంచి ఫలితాలు రాబట్టారు. గత ఏడాదిన్నరలో 20కి పైగా పోలీస్ క్రీడాకారులు గోల్డ్‌మెడల్స్ సాధించారు, వారికి నగదు పురస్కారంతోపాటు ఇంక్రిమెంట్లను ఇప్పించడంలో సఫలీకృతులయ్యారు. సీఎం కేసీఆర్ పోలీస్ సంక్షేమంపై ఎన్నో కార్యక్రమాలను ప్రకటించగా.. వాటిని ఎప్పటికప్పుడు పోలీస్ కుటుంబాలకు అందేలా చర్యలు చేపట్టారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment