తాజా వార్తలు

Saturday, 14 November 2015

175 స్థానాలే లక్ష్యం కావాలి-సీఎం చంద్రబాబు

తిరుపతిలోని జీఆర్ఆర్ ఫంక్షన్ హాలులో జనజాగృతి సన్నాహక యాత్ర పేరిట రెండు రోజుల పాటు జరిగే టీడీపీ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, అందరు ఎమ్మెల్యేలతో పాటు 13 జిల్లాల నుంచి ఎంపిక చేసిన టీడీపీ నేతలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ వివరించారు. అనంతరం చంద్రబాబు పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఏడాదిన్న పాలన తీరును ఆయన వివరించారు. విభజన తర్వాత రాష్ట్రం తీవ్ర ఆర్థిక సమస్యలతో కూరుకు పోయిందని, దానిని ఎలా అధిగమిస్తున్నది వివరించారు. రైతురుణమాఫీ, పింఛన్ల పెంపు వంటి పథకాలతో ప్రజల మన్ననలు పొందామని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉందని క్యాడర్ అలసత్వం చూపవద్దని, మరింతగా నేటి నుంచే కష్టపడాలని కోరారు. జిల్లాలో సమస్యల పరిష్కార బాధ్యత ఇన్ చార్జ్ మంత్రులదేనని తేల్చి చెప్పారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది కూడా ప్రజలకు సంక్రాంతి కానుక ఇవ్వనున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలు మనవే కావాలని చంద్రబాబు క్యాడర్‌కు సూచించారు. అమరావతి నిర్మాణం, నదుల అనుసంధానం గురించి చంద్రబాబు వివరించారు. గోదావరి - కృష్ణ నదులను అనుసంధానం చేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, మొండిగా ముందుకెళ్లి విజయం సాధించామన్నారు. విపక్షాలను చూస్తుంటే తనకు జాలేస్తుందని చెప్పుకొచ్చారు. నీరు-చెట్టు పథకం సత్ఫలితాలను ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య లాంటి గ్యాప్ ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతరం చంద్రబాబు జిల్లాల వారీగా, వేరు వేరుగా క్యాడర్ తో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment