తాజా వార్తలు

Monday, 30 November 2015

ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలకు టీఎస్ పీఎస్ సీ నోటిఫికేషన్

టీఎస్‌పీఎస్‌సీ ద్వారా గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని కమిషనర్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు గ్రూప్ పరీక్షలపై ‘సుమార్గ్’ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇందులో భాగంగా హన్మకొండలోని ఎస్‌వీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చక్రపాణి ముఖ్య అతిథిగా మాట్లాడారు. రానున్న ఐదేళ్లల్లో టీఎస్‌పీఎస్‌సీ ద్వారా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.రాష్ర్ట వ్యాప్తంగా గ్రూప్-2కు సంబంధించి సుమారు 453కు పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వీటి భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని, గ్రూప్-1 ఖాళీలు 53 మాత్రమే ఉన్నట్లు గుర్తించినప్పటికీ వాటి భర్తీ ప్రకటన కొంత ఆలస్యం కావచ్చన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల తర్వాత కేవలం ఏడు నెలల్లోనే నియామకాలు సైతం చేపడతామని చెప్పారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 4,200 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసి, పరీక్షలు సైతం నిర్వహించామని, త్వరలో ఇంటర్వ్యూలు చేపడతామన్నారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా రూపొం దించిన వెబ్‌సైట్ ద్వారా ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి తనకు కావాల్సిన పోస్ట్ ఎంపిక చేసుకోవచ్చన్నారు. పరీక్ష నిర్వహించిన కేవలం 24 గంటల్లోనే ‘కీ’ విడుదల చేశామని, అభ్యర్థి తాను రాసిన సమాధానాలు చూసుకునేలా మరో ఓఆర్‌ఎం షీట్ అందజేశామన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ పాసైన వారి కోసం టీఎస్‌పీఎస్‌సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని చక్రపాణి తెలిపారు. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వివరించారు. అలాగే, హెల్త్ అసిస్టెంట్ పోస్టులు కూడా త్వరలో భర్తీ చేయనున్నామని చెప్పారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment