తాజా వార్తలు

Tuesday, 24 November 2015

కరువు మండలాల ప్రకటన రెండు నెలలు ఆలస్యంగా చేస్తారా..?జగన్

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరువు మండలాల ప్రకటన మొదలు ప్రతి విషయంలో చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కరవు మండలాల ప్రకటనలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లోపించిందని వైఎస్ జగన్ అన్నారు. మొదటి విడతగా 196 కరవు మండలాలను ఆలస్యంగా ప్రకటించారని, ఇంతవరకు వాటికి ఎన్యూమరేషన్ జరగలేదన్నారు. ఇప్పుడు మరో 163 కరవు మండలాలు ప్రకటించడంలో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. వరదలు ఉప్పొంగేదాకా కరువు మండలాలను నోటిఫై చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు. సెప్టెంబర్ 30 కల్లా కరువు రిపోర్ట్ పంపించాల్సిన చంద్రబాబు నవంబర్ 24వ తేదీ వచ్చే వరకు కూడా ఇంకా కరువు మండలాలను లెక్కించే పనిలోనే ఉండడం దారుణమన్నారు. ఆయా రాష్ట్రాలు ఇప్పటికే కరువు నివేదికలు కేంద్రానికి అందించాయని వైఎస్ జగన్ తెలిపారు. కరువు రిపోర్ట్  ఇవ్వకపోవడంపై కేంద్రం చివాట్లు పెట్టిన కారణంగానే...ఉన్నపలంగా కరువు మండలాలను జోడిస్తున్నాడని చంద్రబాబును తూర్పారబట్టారు. కొత్తగా 163 కరువు మండలాలను నోటిఫై చేస్తున్న చంద్రబాబు..అంతకుముందు కళ్లు మూసుకున్నాడా అని నిలదీశారు. ఈరకంగా ప్రజలను మోసపుచ్చుతున్న వ్యక్తిని తన జీవితంలో ఇంతవరకూ చూడలేదని వైఎస్ జగన్ ఫైరయ్యారు. చంద్రబాబు జీవితమంతా మోసం, అబద్ధం, వెన్నుపోటులేనన్నారు. ఎన్నికల ముందు అది చేస్తాం, ఇదీ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు  ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు.  రుణాలు మాఫీ చేయడంలో మోసం, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పించడంలో మోసం ..చంద్రబాబు పాలనంతా అవినీతి, మోసాలేనన్నారు. ఎన్నికలకు ముందు 2013-14 ఏడాదికి సంబంధించి ఇన్ పుట్ సబ్సిటీ చెల్లిస్తామని చెప్పి మోసగించారన్నారు.  2014-15 సంవత్సరానికి  సంబంధించి 736 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ కింద నోటిఫై చేసి దాంట్లో సగం కూడా ఇవ్వలేదన్నారు. ఇలా అన్ని రకాలుగా ప్రజలను మోసపుచ్చుతూ మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నాడని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.  వైఎస్ జగన్ రెండో రోజు నెల్లూరు జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. గూడూరు, వెంకటగిరి, సుళ్లూరుపేట, నాయుడుపేట, వాకాడు తదితర ప్రాంతాల్లో కలియతిరిగారు. దెబ్బతిన్న పంటలు, ఇళ్లు పరిశీలించారు. సర్వం కోల్పోయి అవస్థలు పడుతున్న బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు.  ఈసందర్భంగా వారు జననేతకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను ఎవరూ ఆదుకోవడం లేదని, బతుకులు దుర్భరంగా మారాయని కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరూ అధైర్య పడొద్దని , అండగా ఉంటామని న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని బాధితులకు వైఎస్ జగన్ భరోసానిచ్చారు.
« PREV
NEXT »

No comments

Post a Comment