తాజా వార్తలు

Saturday, 7 November 2015

సారిక కేసులో 24మంది విచారించిన పోలీసులు

సారిక కేసులో 24మందిని పోలీసులు విచారించారు. కేసు వివరాలను అన్నింటిని కలిపి ప్రాథమిక రిపోర్టును తయారు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజయ్య ఇంట్లో మొదటి అంతస్తులో నుంచి మంటలు వస్తున్నాయని సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన ఇంట్లోని మొదటి అంతస్తులో రెండు బెడ్‌రూమ్‌లు, ఒక హాలు, ఒక లివింగ్ రూమ్, పూజగదితోపాటు కారిడార్ ఉంది. మాస్టర్ బెడ్‌రూమ్ తలుపు కిందిభాగం పగిలి ఉంది. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి పరిశీలించగా సారిక, పెద్ద కొడుకు అభినవ్ మృతదేహాలు పక్కపక్కనే పడి ఉన్నాయి. మిగతా ఇద్దరు పిల్లల మృతదేహాలు గ్యాస్ సిలిండర్ల పక్కన ఉన్నాయి. నలుగురి మృతదేహాలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. వరంగల్ ఆర్డీవో సమక్షంలో నలుగురి మృతదేహాలకు పంచనామ నిర్వహించారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్‌ను రప్పించి వేలిముద్రలు, శరీర నమూనాలు సేకరించారు. హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి నమూనాలు సేకరించారు. ఘటనా స్థలం నుంచి 11 వస్తువులను సీజ్ చేశారు. 24మందిని విచారించి కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. మార్చురీలో స్థానిక ఫోరెన్సిక్ వైద్యులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, కొన్ని నమూనాలను పోలీసులకు అందజేశారు. వాటి ఆధారంగా మరణం ఎలా సంభవించింది అనేదానిపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. పూర్తి నివేదిక రావాల్సి ఉండగా, నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు అనిల్, రాజయ్య, భార్య మాధవిని అరెస్ట్ చేసి నాలుగో అదనపు జడ్జి ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన ఆయన ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ ముగ్గురిని అరెస్టు చేయడానికిగల కారణాలను రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. భవిష్యత్‌లో ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యల కోసం, ఈ కేసు దర్యాప్తుకు మరిన్ని సాక్ష్యాలు సేకరించేందుకు వీలుగా, నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున, బాధితుల నుంచి రక్షణ కోసం. రెండో నిందితుడు మాజీ ఎంపీ అయినందున సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఎక్కువేఅని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు: కాలిన బెడ్‌షీట్, కాలిన డోర్‌కర్టెన్, సారిక మృతదేహం వద్ద కాలిన వస్తువులు, బెడ్ పక్కన కాలిన హ్యాండ్ బ్యాగ్, ఆ నలుగురు తిని వదిలేసిన అన్నం, బెండకాయకూర, పచ్చడి, సారిక మృతదేహం వద్దపడి ఉన్న డోర్‌మ్యాట్, బెడ్‌పక్కన పడి ఉన్న మైక్రోమ్యాక్స్ సెల్‌ఫోన్, కోర్టు సమన్స్ కాపీ, భారత్‌గ్యాస్ కార్డు, రెండు గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్‌ను పోలీసులు సీజ్ చేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment