తాజా వార్తలు

Wednesday, 4 November 2015

వరంగల్‌ బరిలో సర్వే సత్యనారాయణ...వరంగల్‌ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక ఆత్మహత్య ఘటనతో, రాజయ్య ఎన్నికల బరిలోంచి తప్పుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి ముందే కాంగ్రెస్‌ పార్టీ, కోడలితో ఇబ్బందులు రావొచ్చని రాజయ్యకు చెప్పినా, అధిష్టానాన్ని మేనేజ్‌ చేసేశారాయన. ఇంతలోనే పెను విషాదం చోటుచేసుకుంది. ఇది రాజయ్యకు మాత్రమే కాదు, కాంగ్రెస్‌ పార్టీకీ సంకటం తెచ్చిపెట్టింది. 
జరిగిన ఘటనలో హత్యకోణం గురించి పలు ఊహాగానాలు విన్పిస్తుండడంతో, అసలు వరంగల్‌ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయడం అవసరమా.? అన్న వాదనలు తెరపైకొచ్చాయి. అయితే, అధిష్టానం 'ఎలాగైనా పోటీ చేయాల్సిందే.. లేదంటే పరువు పోతుంది..' అని భావించి మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణతో సంప్రదింపులు జరిపింది. స్వయంగా రాహుల్‌గాంధీ ఫోన్‌ చేయడంతో, సర్వే సత్యనారాయణ వరంగల్‌కి బయల్దేరినట్లు తెలుస్తోంది. 
మరోపక్క, ఇంత జరిగాక కూడా మాజీ ఎంపీ వివేక్‌, వరంగల్‌లో పోటీ చేసేందుకు మొగ్గు చూపకపోవడం కాంగ్రెస్‌ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సర్వే కంటే ముందు వివేక్‌కి రాహుల్‌ ఫోన్‌ చేసినా, వివేక్‌ ససేమిరా అన్నారట. దాంతో, దారి లేక సర్వే సత్యనారాయణను వరంగల్‌ ఉప ఎన్నికల్లో 'బలిపీఠం' ఎక్కించాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుందని అనుకోవాలి. 
కాంగ్రెస్‌ తరఫున ఎవరు పోటీ చేసినా, 'మాజీ ఎంపీ కోడలి ఆత్మహత్య' కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే మహిళా సంఘాలు, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా వరంగల్‌లో ఆందోళనలు షురూ చేశాయి. సారిక ఆత్మహత్య చేసుకుని వుండదనీ, మాజీ ఎంపీ రాజయ్యే సారికను చంపేసి వుంటారని మహిళా సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 
ఇదిలా వుంటే, ఘటన జరిగిన ఇంటికి సంబంధించి విజువల్స్‌ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. కిచెన్‌ నుంచి గ్యాస్‌ సిలెండర్‌ని బెడ్రూమ్‌లోకి తీసుకెళ్ళినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. చనిపోదామని నిర్ణయించుకునే సారిక ఈ పని చేసి వుండాలి.. లేదా, సారికతో సహా ముగ్గురు పిల్లల్ని చంపేయడానికి ఎవరైనా ఈ పని చేసి వుండాలి. అసలేం జరిగింది.? అన్నది మాత్రం విచారణలోనే తేలనుంది. 
ఇదిలా వుంటే, రాజయ్య కొడుకు అనిల్‌, సారికను ప్రేమించి పెళ్ళి చేసుకున్నా ఆ తర్వాత అనిల్‌ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే అసలు వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. అప్పటినుంచి పలుమార్లు సారిక పోలీసులను ఆశ్రయిస్తూ వచ్చారు. రాజయ్య కుటుంబ సభ్యులపై 498 కేసు కూడా ఈ మేరకు నమోదవడం గమనార్హం. ఏదిఏమైనా, తాజా ఘటనతో సారిక భర్త అనిల్‌, సారిక మామ రాజయ్య సహా పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment