తాజా వార్తలు

Monday, 21 December 2015

కోడ్ ఉన్నప్పుడు హామీలా..?కేటీఆర్ కు ఈసీ క్లాస్

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు హామీలు ఎలా ఇస్తారని ఈసీ మంత్రి కేటీఆర్ కు క్లాస్ పీకింది. ఉల్లంఘన వ్యవహారంలో మంత్రి కేటీఆర్ కు ఎన్నికల సంఘం అక్షింతలు వేసింది. సచివాలయంలో మంత్రి ఛాంబర్‌లో టీఆర్‌ఎస్ పార్టీలో ఇతర పార్టీల నేతల చేరికలు, వారికి పార్టీ కండువాలు కప్పిన ఫిర్యాదుపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. బదులుగా ఈనెల 11వ తేదీన మంత్రి కేటీఆర్ ఇచ్చిన వివరణను సైతం ఈసీ మరోసారి తప్పుబట్టింది. ‘మీ వివరణను పరిశీలిస్తే మీ అంతట మీరే ఒప్పుకున్నారు..’ అంటూ మరోసారి ఆ వివరణను ఈసీ తూర్పార బట్టింది. ‘కొందరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు వాళ్ల ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేసేందుకు, రోడ్లు వేసేందుకు నిధులు కేటాయించాలని అభ్యర్థించారని.. వివిధ పథకాల్లో నిధులిచ్చేందుకు మీరు హామీ ఇచ్చినట్లుగా వివరణలో పేర్కొన్నారు. కానీ ఆ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులందరూ ఎన్నికలు జరుగుతున్న స్థానిక ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్లు. అధికార హోదాలో ఉన్న మీరు వివిధ పథకాల్లో నిధులిస్తామని వారికి హామీ ఇవ్వటం మీ పార్టీ ఎన్నికల ప్రయోజనాల కోసమని భావించాల్సి వస్తుంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుంది.’ అని ఈసీ ఇచ్చిన ఆర్డర్‌లో స్పష్టం చేసింది. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించటంతో పాటు ఇలాంటి ఫిర్యాదులకు ఆవకాశమివ్వకూడదని అందులో సూచించింది.
« PREV
NEXT »

No comments

Post a Comment