తాజా వార్తలు

Tuesday, 15 December 2015

కాల్ మనీపై కొనసాగుతున్న ఉత్కంఠ

కాల్ మనీకేసులో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతున్నది. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ సెలవు రద్దు చేసుకున్నారు. కాల్‌మనీ వ్యవహారంతో పాటు కల్తీమద్యం కేసుల్లో దర్యాప్తును సీరియస్‌గా తీసుకున్న సీపీ తనదైన స్టైల్లో వేగంగా దర్యాప్తు చేశారు. ఇప్పటికే పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పది రోజులు సెలవు మీద వెళ్తున్నట్టు ప్రకటించారు. అయితే ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే సీపీని సెలవు మీద పంపిస్తున్నట్టు వదంతులు వ్యాపించాయి. దీనిపై స్పందించిన కమిషనర్ సవాంగ్ తన 10 రోజుల సెలవును రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. కాల్‌మనీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తోంది. విజయవాడ వ్యవహారం దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా కాల్‌మనీ వ్యాపారులపై దాడులు చేపట్టింది. అలాగే కాల్‌మనీ వ్యవహారం తమ దృష్టికి వచ్చినా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన పటమట సీఐతో సహా ఆరుగురిపై వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
 మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారం తాజాగా ఉత్తరాంధ్రకు పాకింది. విజయవాడ ఘటనతో అప్రమత్తమైన విజయనగరం పోలీసులు జిల్లా వ్యాప్తంగా దాడులకు దిగారు. దుబ్బాడ, విజయనగరం పలు ప్రాంతాల్లో పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి పలు ప్రామీసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
« PREV
NEXT »

No comments

Post a Comment