తాజా వార్తలు

Wednesday, 9 December 2015

కరువును తరమేందుకు దీర్ఘకాలిక వ్యూహాలు-సీఎం కేసీఆర్

తెలంగాణలో కరువు పరిస్థితులను తెలుసుకునేందుకు వచ్చిన కేంద్ర బృందం మహబూబ్‌నగర్‌, నల్లగొండ, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో పర్యటించి మంగళవారం సాయంత్రం సిఎంతో సమావేశమయ్యింది. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌, ఆయిల్‌సీడ్స్‌ డైరెక్టర్‌ పొన్ను స్వామి, డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వినోద్‌ ఎగ్‌బూట్‌, తదితరులు తాము పరిశీలించిన అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు. జలాశయాల్లో నీళ్లు లేవని, రైతులు పంటలు పండించలేకపోయారని, భూగర్బ జలాలు అడుగంటి పోయాయని, మంచినీటికి కొరత వుందని వారు చెప్పారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా చాలా చోట్ల తరచుగా కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీన్ని ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాలు అవలంబించాలన్నారు. తెలంగాణలొ కరువు పరిస్థితులను అధిగమించేందుకు వెంటనే 231 మండలాల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందివ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలను 200 రోజులకు పెంచాలని, పశుగ్రాసానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. తెలంగాణలోని ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జూన్‌ మొదట్లో మంచి వర్షాలే పడ్డాయని, ఖరీఫ్‌ సీజన్‌ ముగిసిపోయే దశలో సెప్టెంబర్‌ చివర్లో కూడా వానలు పడ్డాయని, వీటివల్ల పంటలకు మేలు జరగలేదన్నారు. చాలా ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడం వల్ల మంచినీటి సమస్య కూడా ఎదురయ్యిందన్నారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాత్కాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. రైతులను ఆదుకునేందుకు ఇన్‌పుట్‌ సబ్సిడి, మంచినీటి వసతులు, పశువులకు దాణా లాంటి తక్షణ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, భూగర్బ జలాల పెంపు, అడవుల వృద్ధి లాంటి దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. 
ప్రస్తుతం వర్షాభావ పరిస్థతుల వల్ల కరువు ఏర్పడినప్పటికీ, కరువు ఎదుర్కునే స్థితిలో రాష్ట్రం లేకపోవడానికి సమైక్య పాలకుల వివక్షే కారణమన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించలేదని, తలపెట్టిన ప్రాజెక్టులేవి పూర్తి కాలేదన్నారు. 1964లో ప్రారంభించిన ఎస్‌ఆర్‌ఎస్‌పి నేటికి పూర్తి కాకపోవడం తెలంగాణ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యానికి, వివక్షకు నిదర్శనమన్నారు. 1600 టిఎంసిల నీరు ఏటా సముద్రం పాలవుతున్నా వాటిని ఉపయోగించుకోవడానికి ప్రాజెక్టులు లేవన్నారు. ఫలితంగా తెలంగాణలో రైతులు 21 లక్షల బోర్లు వేసి వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుందన్నారు. భూగర్బ జలాలు అడుగంటి పోవడం వల్ల ఇప్పుడు బోర్లు కూడా పనిచేయడం లేదన్నారు. అందుకే తాము ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేపట్టామని చెప్పారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాల్సి ఉందని, అందులో భాగంగా తెలంగాణలో కూడా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్నారు.
కరువు పరిస్థితుల్లో మంచినిటికి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశ్యంతోనే తెలంగాణలో 'మిషన్‌ భగీరథ' పేరుతో మంచినీటి ప్రాజెక్టును చేపట్టినట్లు వివరించారు. వ్యవసాయం భవిష్యత్తులో మరింత సంక్షభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని, దీని నుండి బయటపడే మార్గాలు ఆలోచించాలన్నారు. వ్యవసాయ భూములను క్రాప్‌ కాలనీలుగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలోని పరిస్థితులను కేంద్రానికి వివరించి తగిన సహాయం అందేలా చూడాలని బృంద సభ్యులను ముఖ్యమంత్రి కోరారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సిఎంఒ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి ఆర్‌. మీనా, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, ప్రభుత్వ సలహాదారు ఎ కె. గోయల్‌ తదితరులు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment