తాజా వార్తలు

Monday, 14 December 2015

మరోసారి టార్గెట్ కేజ్రీవాల్

ఢిల్లీ సచివాలయంలోని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ సోదాలు జరిగాయి. సీఎంఓలోని రాజేంద్రకుమార్ అనే అధికారి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే కేసులో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. సీఎం కార్యాలయం ఉన్న ఫ్లోర్ మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కేంద్రం ఎన్ని రకాలుగా బెదిరించినా తాను మాత్రం భయపడేది లేదని ఆయన అన్నారు. తన కార్యాలయంలో సీబీఐ దాడులు జరిగాయని, అయితే తనను రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆయన మరో ట్వీట్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాము కేజ్రీవాల్ కార్యాలయంలో ఎలాంటి సోదాలు చేయలేదని సీబీఐ వర్గాలు అంటున్నాయి. కేవలం సెక్రటరీ రాజేంద్రకుమార్ కార్యాలయంలో మాత్రమే సోదాలు చేస్తున్నట్లు వివరించాయి. సీఎంఓలోని ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్ మీద, మరికొందరు ప్రైవేటు వ్యక్తుల మీద 'నేరపూరిత దుష్ప్రవర్తన'కు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఢిల్లీ ప్రభుత్వంలోని కొందరు అధికారులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టారు. చాలా కాలంగా వాళ్లకు రాజేంద్ర కుమార్ సాయం చేస్తూ, కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాజేంద్రకుమార్ కార్యాలయంతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో కూడా మంగళవారం ఉదయం సీబీఐ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.  
« PREV
NEXT »

No comments

Post a Comment