తాజా వార్తలు

Wednesday, 30 December 2015

ఢిల్లీ సర్కార్ లో మరో కుంపటి

ఢిల్లీ సర్కార్ లో మరో కుంపటి రాజేసుకుంది. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల సస్పెన్షన్ వ్యవహారం ఢిల్లీ ప్రభుత్వంలో ప్రస్తుతం మంటలు రేపుతోంది. ఈ సస్పెన్షన్లకు నిరసనగా 200 మంది అధికారులు సామూహిక సెలవు పెట్టాలని నిర్ణయించుకోవడంతో ఏం చేయాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు.  స్పెషల్ సెక్రటరీ (ప్రాసిక్యూషన్) యశ్‌పాల్ గార్గ్, స్పెషల్ సెక్రటరీ (ప్రిజన్స్) సుభాష్ చంద్రలను ఢిల్లీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల జీతాల పెంపునకు సంబంధించిన ఫైలుపై లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండా తాము సంతకాలు పెట్టేది లేదని అనడంతో వీళ్లను సస్పెండ్ చేశారు. దీంతో కేంద్రానికి.. కేజ్రీ సర్కారుకు మధ్య మరోసారి గొడవ మొదలైంది. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో పనిచేసే ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు మాత్రమే ఉంటుంది. దానికి కూడా ముందుగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతి తప్పనిసరి. ఇదేమీ లేకుండానే సీనియర్ ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేయడంతో.. ఇప్పుడు అక్కడంతా గందరగోళం నెలకొంది.
మరోవైపు ఉద్యోగులు ఇలా సామూహిక సెలవులో వెళ్లడం కుట్రేనని రాష్ట్ర హోం మంత్రి సత్యేంద్ర జైన్ మండిపడ్డారు. అసలు తనకు సమ్మె గురించి ఎలాంటి సమాచారం లేదని ఆయన అన్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయకపోవడం వల్లే వాళ్లను సస్పెండ్ చేశారని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం జారీచేసే కొన్ని ఉత్తర్వులను నిలుపుదల చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉంటుంది గానీ, మొత్తం ఉత్తర్వులే పనికిరావని చెబితే మాత్రం దాన్ని ఆమోదించేది లేదన్నారు. అయినా ఉద్యోగులకు ఏవైనా సమస్యలుంటే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాలి తప్ప లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు కాదని సత్యేంద్రజైన్ తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment