తాజా వార్తలు

Thursday, 10 December 2015

ఓయూలో ముగిసిన పెద్ద కూర పంచాయితి

  ఓయూలో బీఫ్ ఫెస్టివల్ జరిగినట్లు వాట్సప్, ఫేస్‌బుక్‌లలో కొన్ని ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించరాదని హైకోర్టు ఆదేశించినా, మరోవైపు ఓయూలో గురువారం బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఓయూలోకి వెళ్లడానికి ప్రయత్నించగా.. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన పలువురు బీజేపీ, బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్సుపైకి రాళ్లు రువ్వారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు, కార్యకర్తల అరెస్ట్‌లతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కాగా ఓయూలో అరెస్ట్ ల పర్వం ఇంకా కొనసాగుతోనే ఉంది. బీఫ్‌ ఫెస్టివల్‌కు మద్దతు తెలపడానికి వచ్చిన ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. పెద్దకూర పండుగ నిర్వహించేందుకు యత్నించిన పలువురు విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అలాగే గో పూజ నిర్వహించేందుకు... ఓయూలో వెళ్లేందుకు యత్నించిన ఏబివిపి, గోసంరక్షణ సమితి, భజ్‌రంగ్‌ దళ్‌ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఎలాగైనా బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతుండగా.. ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని పోలీసులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో  పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. గేట్లు మూసివేసి.. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా కట్టడి చేశారు. లోపలికి వెళ్లినవారిని సైతం బయటకు పంపించి విద్యార్థి నేతల కోసం ఆరాతీశారు. ఎన్‌సీసీ గేటు సమీపంలో ఉన్న కావేరి హాస్టల్‌లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. నర్మద వసతిగృహంతో పాటు ఇతర చోట్ల విస్తృతంగా గాలించారు. డీసీపీ చంద్రశేఖర్ రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షించారు. బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించేది విద్యార్ధులైతే అడ్మిషన్లు రద్దు చేస్తామని ఓయూ రిజిస్ట్రార్ హెచ్చరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment