తాజా వార్తలు

Thursday, 3 March 2016

కాలితో బౌలింగ్...భుజంతో బ్యాటింగ్

కశ్మీర్: ఈ సమాజంలో చేతులు లేని వాళ్లు కాళ్లతో తమ పనులు తాము చేసుకోవడం, బలపం పట్టి దిద్దడం, పెన్ను పట్టి రాయడం, చదువులో ఫస్ట్ రావడం మనం చూశాం. చూస్తున్నాం. 26 ఏళ్ల అమీర్ హుస్సేన్ లోన్ వారందరికన్నా ముందున్నారు. రెండు చేతులు భుజాల వరకు లేకున్నా క్రికెట్‌లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. కుడికాలు పెకైత్తి ఎంచక్కా బౌలింగ్ వేస్తారు. భుజానికి, గదమకు మధ్య క్రికెట్ బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ చేస్తారు. ఆ బ్యాట్‌ను అలాగే పట్టుకొని పరుగులు తీస్తారు.

హుస్సేన్ ఎవరి సాయం లేకుండా తన పనులను తానే చేసుకుంటారు. స్నానం చేసి బట్టలు వేసుకోవడం దగ్గరి నుంచి గడ్డం గీసుకోవడం, కాలేజీకెళ్లి చదువుకోవడం. కాలుతో పెన్ను రాయడం లాంటి పనులు తేలిగ్గా చేసుకుంటారు. హుస్సేన్ ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రి కట్టెల కోత మిషన్‌లో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు రెండు చేతులు తెగిపోయాయి.  మిగిలిన చేతుల భాగాలను శస్త్ర చికిత్సలో తీసివేయాల్సి వచ్చింది. ట్రీట్‌మెంట్‌కు ఎంతో ఖర్చయింది. ఆ ఖర్చును భరించేందుకు ఆయన తండ్రి తమకున్న పొలాన్ని అమ్మేయాల్సి వచ్చింది.

భుజాల వరకు రెండు చేతులు లేకుండా మనుగడ సాగించడం హుస్సేన్‌కు మొదట్లో కష్టమైంది. చదువుకోవడానికి స్కూల్ కు వెళితే ‘నీవు చదువుకు పనికి రావు’ అంటూ స్కూల్ నుంచి వెళ్లగొట్టారు. అయినా అందరితోపాటు తాను చదవగలను, రాయగలనని అనతికాలంలోనే కాశ్మీర్‌కు చెందిన ఈ హుస్సేన్  నిరూపించి పాఠశాలలో చేరారు. ప్రస్తుతం కాశ్మీర్ పారా క్రికెట్ అసోసియేషన్‌లో సభ్యుడయ్యారు. తన ఆట తీరుతో అభిమానులను కూడా సంపాదించుకున్నారు. బలమైన సంకల్పం, ఎంతటి  అకుంఠిత దీక్ష ఉంటే తప్పా ఇది సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయం మానవ స్ఫూర్తికే స్ఫూర్తిగా నిలుస్తున్న హుస్సేన్ వీడియోను ప్రత్యక్షంగా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.


« PREV
NEXT »

No comments

Post a Comment