తాజా వార్తలు

Thursday, 3 March 2016

నారాయణ నారాయణ.. ఆ ఫ్రస్టేషన్‌ ఏంటి.?

'యాక్చువల్‌గా..' అంటూ ఎప్పుడూ కూల్‌గా మాట్లాడే 'నారాయణ' విద్యా సంస్థల అధిపతి, తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ.. పైగా మంత్రి అయిన నారాయణ, శృతి తప్పుతున్నారు. ఫ్రస్ట్రేషన్‌తో ఊగిపోతున్నారు. 'టాట్‌..టూట్‌..' అంటూ ఎగిరెగిరి పడుతున్నారు. ఇది నారాయణలోని కొత్త కోణం. బహుశా ఇప్పటిదాకా ఎవరూ నారాయణను అలా చూసి వుండలేదేమో.! 
కారణం అందరికీ తెల్సిందే, అమరావతిలో నారాయణ అక్రమాలు.. అవినీతి బాగోతాలు.. అంటూ సాక్షి మీడియా కథనాల్ని తెరపైకి తీసుకురావడంతో, నారాయణకు పట్టరాని కోపం పుట్టుకొచ్చింది. దాదాపు 3 వేల ఎకరాల భూముల్ని అప్పనంగా నారాయణ కాజేశారన్నది సాక్షి ప్లస్‌ వైఎస్సార్సీపీ ఆరోపణ. వీటి విలువ సుమారుగా 14 వేల కోట్లు వుంటుందన్నది ఆ ఆరోపణల సారాంశం. పైగా, నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే చిరుద్యోగుల పేరుతో ఎకరాలకు ఎకరాల భూముల్ని కొల్లగొట్టారంటూ సవివరంగా సాక్షి కథనాల్ని తెరపైకి తెచ్చింది. నారాయణ తన బంధువులతోనూ భూముల్ని కొనుగోలు చేయించారంటూ వాటి వివరాల్నీ సాక్షి పేర్కొంది. నారాయణ భూ దందాకి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలన్నది సాక్షి ప్లస్‌ వైఎస్సార్సీపీ ఆరోపణ. 
మామూలుగా అయితే, ఇదంతా ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారం అని నారాయణ కొట్టి పారేయొచ్చు. కానీ, నారాయణ అలా ఊరుకోవడంలేదు. 'మా సంస్థలో 40 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు.. లక్షలాది మంది విద్యార్థులున్నారు.. వారెవరో భూములు కొనుగోలు చేస్తే అవన్నీ నా ఖాతాలో వేసెయ్యడం ఎంతవరకు సబు.?' అన్నది నారాయణ ప్రశ్న. 
నిజమే అనుకుందాం. మహా అయితే నారాయణలో పనిచేసే పెద్ద ఉద్యోగికి లక్ష రూపాయల జీతం వుంటుంది. ఇంకా ఎక్కువనుకుంటే రెండు నుంచి ఐదు లక్షల జీతం వుండొచ్చు. అలాంటి వ్యక్తులు 50 నుంచి 100 కోట్ల ఖర్చు చేసి భూముల్ని ఎలా కొనుగోలు చేయగలరు.? ఇది లాజిక్కే కదా. ఆ సంగతేంటని నారాయణని ప్రశ్నిస్తే, అది ఇంకమ్‌ ట్యాక్స్‌ విభాగం చూసుకుంటుంది.. అయినా ఆ విషయం భూములు కొన్నవారిని అడగండి.. అని ఆయన సెలవిస్తున్నారు. 
ఒక్కటి మాత్రం నిజం. రాజధాని పేరుతో భూ దందా జరిగింది. అలాంటిలాంటి భూ కుంభకోణం కాదిది. రాజధాని ఎక్కడ.? అన్నది నిర్ణయించింది అదికార పార్టీనే. దానికి ముందు హైడ్రామా నడిచింది. ప్రకాశం జిల్లా దోనకొండ, కర్నూలు, నూజివీడు... ఇలా రకరకాల పేర్లు తెరపైకొచ్చి, చివరకు గుంటూరు జిల్లా వద్ద ఆగింది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పక్షం. ఈలోగా భూముల కొనుగోలు షురూ చేసింది. ఇప్పుడా భూముల రేట్లు కోట్లకు పడగలెత్తాయి. ఇదీ అసలు కథ. 
భూములు ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. కానీ, ప్రజల దృష్టి మరల్చి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ బినామీలతో భూములు కొనిపించడమే అక్రమం అన్యాయం.. అవినీతికి పరాకాష్ట. నారాయణ ఎవరు.? ఆయనేమన్నా దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో వున్న వ్యక్తా.? కాదే. మరి, ఆయన్ను చంద్రబాబు, మంత్రినెలా చేశారు.? ఇది మొదటి నుంచీ చాలామందికి అనుమానమే. నారాయణ, ఆర్థికంగానే కాక అనేక విధాలుగా తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నికల్లో సాయం చేశారు. అదీ అసలు సంగతి. 
నారాయణకు మంత్రి పదవి ఇచ్చారు సరే, కీలకమైన రాజధాని నిర్మాణ బాధ్యతలూ ఆయనకే ఎందుకు అప్పగించినట్లు.? ఇదే ప్రశ్న టీడీపీ వర్గాల్లోనూ అగ్గిరాజేసింది. అయినా చంద్రబాబు వ్యవహారాన్ని కామప్‌ చేశారు. రెవెన్యూ మంత్రి.. పైగా ఉప ముఖ్యమంత్రి అయిన కేఈ కృష్ణమూర్తి కూడా నారాయణ తీరు పట్ల ఓ సందర్భంలో అసహనం వ్యక్తం చేసినా, ఆయన మాటకు చంద్రబాబు విలువ ఇవ్వలేదు. నారాయణే సర్వస్వం.. అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారు. 
కట్‌ చేస్తే.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత ఎక్కువగా అమరావతిలో భూములున్న నేతగా నారాయణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎందుకిలా.? చిన్న పిల్లాడినడిగినా చెప్పేస్తాడు. హైద్రాబాద్‌లో చంద్రబాబుకి మురళీమోహన్‌ ఎలాగో, అమరావతిలో చంద్రబాబుకి నారాయణ అలా అని.! బాగోతం బయటపడేసరికి నారాయణలో ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కి వెళ్ళిందంతే.
« PREV
NEXT »

No comments

Post a Comment