తాజా వార్తలు

Thursday, 26 May 2016

యూపీలో ఒవైసీ భారీ టార్గెట్‌!

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలుపనున్నట్టు ఏఐఎంఐఎం తాజాగా ప్రకటించింది. అధికార సమాజ్‌వాదీ పార్టీ, ప్రతిపక్ష బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఓటుబ్యాంకును దెబ్బకొట్టడమే లక్ష్యంగా అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం అడుగులు వేస్తోంది.

పార్టీ ఇప్పటికే అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించిందని, ప్రధానంగా ముస్లింలు, దళితుల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెడతామని ఎంఐఎం యూపీ అధ్యక్షుడు షౌకత్ ఆలి తెలిపారు. ఇక, 'జై భీమ్‌, జై ఎంఐఎం' నినాదంతో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఎంఐఎం భావిస్తోంది. దళిత-ముస్లిం కాంబినేషన్‌ ఓట్లు లక్ష్యంగా ప్రచారం నిర్వహించనుంది.

ఎంఐఎం వ్యూహం ముఖ్యంగా ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీలను దెబ్బతీసే అవకాశముంది. ఎస్పీకి ముస్లింలో గట్టి ఓటుబ్యాంకు ఉండగా, బీఎస్పీకి దళితుల్లో పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ముస్లిం-దళిత కాంబినేషన్‌ మెరుగైన సీట్లు, ఓట్లు సాధిస్తామని ఎంఐఎం భావిస్తోంది. ఇదే నినాదంతో గత ఫిబ్రవరిలో జరిగిన బికాపూర్ అసెంబ్లీ సీటు ఉప ఎన్నికల్లో ఎంఐఎం మంచి ఓట్లు సాధించింది. దళిత అభ్యర్థిని ఇక్కడ బరిలోకి దింపి బీజేపీ కన్నా 100 ఓట్లు మాత్రమే తక్కువ తెచ్చుకొని నాలుగోస్థానంలో నిలిచింది.

యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంఐఎం ఇప్పటినుంచే పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 10 లక్షల మంది పార్టీ ప్రాథమిక స్వభ్యత్వం తీసుకున్నట్టు ఎంఐఎం తెలిపింది. రంజాన్‌ పర్వదినం అనంతరం యూపీలో అసదుద్దీన్‌ ఓవైసీతో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని భావిస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment