తాజా వార్తలు

Saturday, 14 May 2016

త్వరలో భారతీయుడు సీక్వెల్

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భారతీయుడు. దేశంలో లంచం వల్ల జరుగుతున్న అన్యాయాలపై ఓ స్వాతంత్ర్య సమరయోధుడు చేసే పోరాటంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. కమల్ హాసన్ మేకప్ తో పాటు, ఫైట్స్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. అందుకే భారతీయుడు రిలీజ్ అయినప్పటి నుంచే ఆ సినిమా సీక్వెల్ పై చర్చ మొదలైంది.

అప్పట్లో భారతీయుడు సినిమాను నిర్మించిన ప్రతిష్ఠాత్మక నిర్మాణసంస్థ సూర్య మూవీస్ ఇన్నేళ్ల తరువాత ఆ సినిమాకు సీక్వెల్ నిర్మించే ఆలోచన చేస్తోంది. కమల్ హాసన్, శంకర్ కూడా భారతీయుడు సీక్వెల్ ను రూపొందించడానికి ఆసక్తి చూపిస్తుండటంతో త్వరలోనే ఈ సినిమా కార్యరూపం దాల్చనుందన్న టాక్ వినిపిస్తోంది. సూర్య మూవీస్ నిర్మాత ఏఎమ్ రత్నం ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు.

తొలి భాగం చివర్లో విదేశాలకు వెళ్లిపోయిన భారతీయుడు మళ్లీ తన దేశానికి నా అవసరం ఉన్నప్పుడు తిరిగి వస్తానంటూ మాట ఇస్తాడు. అదే లైన్ తీసుకొని సీక్వెల్ ను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుందో మాత్రం వెల్లడించలేదు.
« PREV
NEXT »

No comments

Post a Comment