తాజా వార్తలు

Wednesday, 25 May 2016

బాబూ.. స్టార్ హోటల్ నుంచి బయటకు రా..!

ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే ఫైవ్‌స్టార్ హోటల్‌నుంచి బయటకు రావాలని, అక్కడ నివాసముండి ప్రజాధనాన్ని దుబారా చేయొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు తన కుటుంబంతో ప్రస్తుతం నివసిస్తున్న స్టార్ హోటల్ దేశంలోని అగ్రగామి హోటళ్లలో ఒకటని, లక్షలాది రూపాయల అద్దెను చెల్లిస్తున్నారని ఆయన చెప్పారు. అంబటి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్యాయంగా, అక్రమంగా విభజించారని చంద్రబాబు ఒకవైపు ఆక్రోశిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని స్వయంగా చెబుతూ మరోవైపు అత్యంత విలాసవంతమైన హోటల్‌లో నివాసముండటం సబబేనా? అని ప్రశ్నించారు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నీరో చక్రవర్తని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించడాన్ని అంబటి అభ్యంతరపెట్టారు. ‘ఎవరు నీరో? విభజన నేపథ్యంలో కష్టాలు పడుతున్న రాష్ట్రప్రజల్ని పట్టించుకోకుండా స్టార్ హోటళ్లలో నివాసముంటున్న చంద్రబాబు నీరోనా? జగనా?’ అని ప్రశ్నించారు. టీడీపీ వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న మినీ మహానాడుల్లో ఎలాంటి ప్రజోపయోగమైన చర్చలూ జరగట్లేదని, జగన్‌ను ఆడిపోసుకోవడం, వైఎస్సార్‌సీపీ నుంచి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల రాకను పాత టీడీపీ నేతలు నిరోధించి ఘర్షణలు పడడంతోనే సరిపోయిందన్నారు.  

 కాపు భవనాలదో నాటకం..
 ‘‘కాపుభవనాలు, కాపు సంక్షేమ పథకాలన్నింటి ముందూ తన పేరు(చంద్రన్న)ను చేర్చాలని చంద్రబాబు జీవో ఎమ్మెస్ నంబర్ 16న జారీ చేసి తీరా కాపులు తిరగబడ్డాక అయ్యో నాకు తెలియదే అని నాటకాలాడుతున్నారు. ఇదెలా జరిగిందంటూ ఆయన ఘీంకరించినట్లు టీడీపీ అనుకూల పత్రికల్లో ప్రచారం చేసుకున్నారు. ఇదంతా ఓ డ్రామా’’ అని అంబటి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తెలియకుండానే ఈ జీవో జారీఅయిందా? అని ప్రశ్నించారు. నిజంగా చంద్రబాబుకు తెలియకుండా ప్రభుత్వంలో జీవోలు జారీఅవుతుంటే ఆయన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడం ఉత్తమమన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment