తాజా వార్తలు

Saturday, 7 May 2016

త్వరలో ఎస్వీబీసీ తమిళ ఛానల్

తెలుగు బుల్లితెరపై ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేష ఆదరణ పొందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఇక తమిళ భాషలోనూ కనిపించనుంది. ఇందుకోసం టీటీడీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వైభవ ప్రాశస్త్యం, ఆథ్యాత్మిక, ధార్మిక, భక్తి కార్యక్రమాలను జనబాహుళ్యంలో నేరుగా తీసుకెళ్లాలని టీటీడీ సంకల్పించింది. ఆమేరకు జూలై 7వ తేదీ, 2008న శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ను ప్రారంభించింది.

రోజూ తిరుమల, తిరుచానూరు అమ్మవారి ఆలయంలో నిర్వహించే విశేష సేవల ప్రత్యక్ష ప్రసారాలు ఎస్వీబీసీ ప్రత్యక్షంగా భక్తుల ఇళ్ల వద్దకే చేరుస్తోంది. రోజుకు 11 గంటలు కేటాయించారు. ఏపీ, తెలంగాణ వారికి తెలుగులోనే వ్యాఖ్యానం చేస్తుంటారు.  ఇక  తమిళనాడులోని భక్తులకు తమిళ వ్యాఖ్యానం, కర్ణాటకాలోని భక్తులకు కన్నడ వ్యాఖ్యానం చేయటం వల్ల ఆయా ప్రాంతాల్లోని భక్తులకు సులభంగా శ్రీవారి కార్యక్రమాలు చేరుతున్నాయి. వీటితోపాటు తమిళ భక్తుల కోసం ఆథ్యాత్మిక విశేషాలు, ప్రవచనాలు, భక్తి కార్యక్రమాల కోసం 1.30 గంటలు, కన్నడ భక్తుల కోసం గంట కేటాయించారు.

ఇలా తమిళ భక్తులకు 12.30 గంటలు, కన్నడ భక్తులకు 12 గంటలపాటు శ్రీవారి కార్యక్రమాలు చేరవేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చేవారిలో 35 నుంచి 45 శాతం తమిళ భక్తులు, మరో 20 శాతం కన్నడ భక్తులు ఉన్నారు. వీరికోసం ప్రత్యేకంగా తమిళంలోనే ఎస్వీబీసీ కార్యక్రమాలు ప్రసారం చేయాలని రెండేళ్లకు ముందే టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు లెసైన్సు హక్కుల కోసం ఢిల్లీలోని సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసుకుంది. తమిళ, కన్నడ భక్తుల నుంచి తమ భాషలకు కూడా ప్రాధ్యాత ఇవ్వాలని విజ్ఞప్తులు పెరిగాయి. దీంతో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తమిళఛానల్‌పై దృష్టిపెట్టారు.
 
అతిత్వరలోనే తమిళ ఛానల్
ఎస్వీబీసీకి భక్తుల నుంచి విశేష ఆదరణ ఉంది. తిరుమలకు వచ్చేవారిలో తమిళులు, కన్నడిగులూ  ఉన్నారు. వారి భాషల్లోనూ స్వామి కైంకర్యాలతోపాటు టీటీడీ కార్యక్రమాలను విసృతం చేసేందుకు తమిళ ఛానల్ అవసరం ఉంది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సంబంధిత మంత్రిత్వశాఖతో సంప్రదింపులు చేస్తున్నాం. త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నాం. 
« PREV
NEXT »

No comments

Post a Comment