తాజా వార్తలు

Saturday, 21 May 2016

‘బ్రహ్మోత్సవం’ రివ్యూ
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు’లో మహేష్‌బాబును కొత్తగా చూపారు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. మహేష్‌ ఇమేజ్‌ కంటే చిన్నోడిగా ఆయన నటనే గుర్తుంటుంది. మళ్లీ మహేష్‌ బాబు, దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల కలసి చేసిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ప్రచార చిత్రాలతోనే శ్రీకాంత్‌ అడ్డాల మార్క్‌ కుటుంబ కథా చిత్రమని స్పష్టమైంది. మహేష్‌ గత చిత్రం ‘శ్రీమంతుడు’ భారీ విజయం సాధించడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. నేడు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో.. రివ్యూ చదివి తెలుసుకోండి.
కథ :
మామగారు ఇచ్చిన నాలుగు వందల రూపాయలతో చంటబ్బాయ్‌ (సత్యరాజ్‌) తన జీవిత ప్రయాణం ప్రారంభిస్తాడు. పిల్లలు పెద్దయ్యేసరికి పెద్ద కలర్స్‌ కంపెనీ అధినేతగా ఉన్నత స్థానంలో ఉంటాడు. బావ మరుదులు నలుగుర్నీ తన వ్యాపారంలో భాగస్వాములను చేసుకుని ముందుకు వెళ్తాడు. ప్రతి సందర్భాన్ని కుటుంబమంతా కలసి ఓ ఉత్సవంలా జరుపుకోవాలని.. అందరితో కలసుండాలని.. చంటబ్బాయ్‌ కోరిక. వాళ్లబ్బాయి (మహేష్‌ బాబు)ది కూడా తండ్రి వ్యక్తిత్వమే. పెద్ద బావమరిది(రావు రమేష్‌) ఎప్పుడూ అసంతృప్తితో ఉంటాడు. అతడి వలన కుటుంబంలో ఓ చీలిక ఎర్పడుతుంది. చంటబ్బాయ్‌ కుమారుడు ఈ మనస్పర్థలను తొలగించి కుటుంబం అంతటినీ ఒక్కటిగా ఎలా చేశాడు? ‘బ్రహ్మోత్సవం’ చిత్రం.
విశ్లేషణ :
శ్రీకాంత్‌ అడ్డాల చిత్రాలు చూస్తుంటే.. మన కుటుంబంలోనూ, బంధువుల కుటుంబంలోనూ అచ్చంగా ఇటువంటి సంఘటన జరిగింది కదూ! అనిపిస్తుంది. సహజత్వానికి దగ్గరగా సన్నివేశాలను తెరకెక్కిస్తారు. ఈ చిత్రంలోనూ అంతే. శ్రీకాంత్‌ చిత్రాల్లో చెప్పుకోవడానికి పెద్దగా కథ ఉండదు. కానీ, తీసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో కథకుడిగా, దర్శకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల ఆశించిన రీతిలో ప్రతిభ కనబరచలేదు. కథ, కథనం.. రెండూ అతుకుల బొంతలా ఉంటుంది. విశ్రాంతి తర్వాత ఓ అరగంట పాటు కథ పక్కదారి పట్టింది. ప్రథమార్థంలో చెప్పిన, ముగించిన అంశాలకు ద్వితీయార్థంలో కథను ముందుకు తీసుకువెళ్లిన అంశాలకు అసలు పొంతన ఉండదు. దర్శకుడిలో గందరగోళం తెరపైనా కనిపించింది. కథగా ఆలోచిస్తే ఒక్క ముక్క కూడా అర్థం కాదు. సన్నివేశాల పరంగా బాగుంటుంది.
‘సీతమ్మ..’లో కనిపించిన ప్రతివారిని చిరునవ్వుతో పలకరిస్తూ.., జీవితంలో ముందుకు సాగుదామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రంలో ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలా నలుగురితో కలసి జరుపుకుందాం. అందరితో సంతోషంగా గడుపుదామని చెప్పారు. మహేష్‌, సత్యరాజ్‌, రావు రమేష్‌ల నటన, తోట తరణి సెట్స్‌, రత్నవేలు ఛాయాగ్రహణం బాగున్నాయి. మహేష్‌కి ఓ సిగ్నేచర్‌ డైలాగ్‌ ఉంటుంది. ‘పెద్దగా ఆలోచించలేదు.., అనిపించింది చెప్పేశానని’. అలా శ్రీకాంత్‌ అడ్డాల కూడా తనకు తోచింది తీసినట్టున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment