తాజా వార్తలు

Wednesday, 25 May 2016

చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుళ్లు, మసీదులు, చర్చిలు లేకుంటే జనాలకు పిచ్చి పట్టేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ...కష్టం వస్తే జనాలు దేవుడిని నమ్ముకుంటారని, అందుకే ఎక్కువ తప్పులు చేసి, ఎక్కువ డబ్బులు హుండీల్లో వేస్తున్నారన్నారు. దీంతో ఆ శాఖ ఆదాయం పెరిగిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మద్యం తాగకుండా ఉండటం కోసమే కొంతమంది దీక్షలు తీసుకుంటున్నారని, దీక్షలు తీసుకున్న ఆ 40 రోజులు లిక్కర్ అమ్మకాలు తగ్గుతున్నాయని ఆయన లెక్కలు చెప్పారు.

ఏపీలో దేవాదాయశాఖ ఆదాయం బాగా పెరిగిందని, ఆ శాఖ ఆదాయ అభివృద్ధికి అధికారులు కష్టపడి పనిచేయకపోయినా, 27శాతం ఆదాయం పెరిగిందని చంద్రబాబు తెలిపారు. పక్కరాష్ట్రాల అభివృద్ధి చూసి అసూయ కలుగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల కంటే బాగా పని చేయడం కోసం ఆలోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ 3.1 శాతం పెరిగిందన్నారు. ఇకనుంచి ప్రతి మూడు నెలలకు ఓసారి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. అధికారులు, రాజకీయ నేతలంటే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. అధికారులు పనిచేయరనే అభిప్రాయం వారిలో నెలకొందని, ఆ అభిప్రాయాన్ని సమూలంగా మార్చాలన్నారు.

అభివృద్ధిలో జిల్లాల మధ్య పోటీతత్వం పెరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలవాలన్నారు. గత రెండేళ్లలో కలెక్టర్ల పనితీరు అభినందనీయంగా ఉందంటూ చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని చంద్రబాబు తెలిపారు. తలపకి ఆదాయంలో ఉత్తరాంధ్ర జిల్లాలే తొలి, చివరి స్థానాల్లో ఉన్నాయన్నారు.  రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలని, ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు.

« PREV
NEXT »

No comments

Post a Comment