తాజా వార్తలు

Saturday, 28 May 2016

ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి

బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఆదర్శనేతగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిన మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావుకు కేంద్రప్రభుత్వం కచ్చితంగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు డిమా ండ్ చేశారు. మహానాడు తీర్మానాన్ని కేంద్రానికి పం పుతున్నామని చెప్పారు.  తిరుపతి మహానాడులో రెండో రోజైన శనివారం ఆయన ‘యుగపురుషుడు ఎన్టీఆర్‌కు నివాళి’ తీర్మానంపై ప్రసంగించారు.

కొత్త రాజధాని అమరావతిలో త్వరలో నిర్మించే 125 అడుగుల బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి దగ్గరలో తెలుగు ప్రజల ఆరాధ్యుడైన ఎన్టీఆర్ విగ్రహాన్ని 115.53 అడుగుల ఎత్తులో నిర్మించనున్నామని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న 35వ మహానాడు వేదికపై ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, ఈ నేపథ్యంలో విగ్రహం ఎత్తు 35 మీటర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అమరావతిలో అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నామన్నారు.

 10 తీర్మానాలకు ఆమోదం...
 మహానాడు రెండోరోజైన శనివారం కార్యక్రమం ప్రారంభం కాగానే తొలిసారి నందమూరి బాలకృష్ణ ప్రసంగించారు. ఆయన తండ్రి ఎన్టీఆర్ ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. అనంతరం పది తీర్మానాలు ప్రవేశపెట్టారు. వాటిని పార్టీ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

 ఐదు నిమిషాలకో పూలదండ...
 ఐదు నిమిషాలకో పూలదండతో పార్టీ నేతలు సీఎం చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణలను ముంచెత్తారు. పార్టీ నాయకులు, అభిమానుల హడావుడి చూసి సీఎం చంద్రబాబు ఓ సందర్భంలో అసహనం వ్యక్తం చేశారు. ఇంకెవ్వరూ పూలబొకేలు, దండలు తీసుకుని రావద్దని సూచించారు.

 మహానాడు నిర్వాహకులపై సీఎం ఫైర్
 మహానాడు నిర్వహణ బాధ్యతల్లో ఉన్న పార్టీ కమిటీలు, నేతలపై శనివారం సీఎం చంద్రబాబునాయుడు అక్షింతలు వేశారు. నిర్వహణ సరిగా లేదని మండిపడ్డారు. మైకులు సరిగా పనిచేయకపోవడమే బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమన్నారు.

 పోలీసులకు టీటీడీ భోజనాలు
 తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు బందోబస్తు విధులకు వచ్చిన పోలీసులకు టీటీడీ భోజనాలను సరఫరా చేశారు. మహానాడు బందోబస్తు కోసం రాష్ట్రం లోని పలు జిల్లాల నుంచి సుమారు 3,500 పోలీసులు బందోబస్తు విధుల కోసం వచ్చారు. వారందరికీ టీటీడీకి చెందిన సాంబారు అన్నం, పెరుగు అన్నం వేరు వేరుగా ప్యాకెట్లలో వేసి టీటీడీకి చెందిన శ్రీనివాసం నుంచి సరఫరా చేశారు. అన్నం పొట్లాలు దుర్వాసన వస్తుండడంతో చాలామంది పోలీసులు తినకుండా పడవేశారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు మహానాడులోని భోజనాలు తినరాదని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. కానీ టీటీడీ సరఫరా చేసిన అన్నం పొట్లాలు వాసన వస్తుండడంతో కొంతమంది చాటుగా మహానాడులో భోంచేశారు.
 
 సాక్షి, జగన్‌లపై మళ్లీ బాబు అక్కసు
 సీఎం చంద్రబాబు మరోసారి ప్రతిపక్ష నేతై వైఎస్ జగన్, సాక్షి పత్రికపైనా అక్కసు వెళ్లగక్కారు. రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పదేపదే అడ్డుపడుతున్నారని ఆరోపించారు.ప్రతిపక్ష నేత అడిగే వాటన్నింటికీ సమాధానం చెప్పాలంటే బాధగా ఉంటున్నా, తప్పదన్నారు.అమరావతిలో భూముల కుంభకోణం జరిగిందని రాతల ద్వారా విషం కక్కారన్నారు. ‘ఇంకా రైతులకు భూములు పంచనే లేదు... వేల కోట్ల కుంభకోణమంట’ అని విస్మయాన్ని వ్యక్తం చేశారు. ‘సాక్షి’లో ప్రచురితమయ్యే కథనాలన్నీ డిటెక్టివ్ కథల్లాంటి ఊహాజనిత వార్తలేనన్నారు. తప్పుడు వార్తలు రాస్తున్నారనీ, త్వరలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment