తాజా వార్తలు

Tuesday, 17 May 2016

రైతుల్ని మోసం చేసింది కాంగ్రెసే

‘‘ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే.. దొంగే దొంగా.. దొంగా అంటు అరిచినట్లు.. తప్పు చేసిన వారే ఇప్పుడు.. తప్పు జరిగిందని అంటున్నారు.. అప్పట్లో రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర, కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీనే ఎనిమిదేళ్లు అధికారంలో ఉంది. అప్పుడు 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎందుకు ఒప్పందం చేసుకోలేదు.’’ అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించా రు.

మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులో పెన్‌గంగపై నిర్మించ తలపెట్టిన కొరటా-చనాఖా బ్యారేజీ స్థలం వద్ద ఆదివారం రాత్రి బస చేసిన హరీశ్‌రావు సోమవారం ఉదయం మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలిసి బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అక్కడే  విలేకరుతో ఆయన మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. తమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల వరద జలాలున్నా.. ఇందులో 75 శాతానికి మించి నీటిని తరలించేందుకు వీలు కుదరదని అప్పట్లో సీడబ్ల్యుసీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. ఇందుకోసమే రీడిజైన్ చేసి, మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు.

 జగన్‌పై విమర్శలు..
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు కేబినెట్ తీర్మానం చేసిందని, టీడీపీ కోర్టుకు వెళుతోందన్నారు. ఈ ప్రాజెక్టును ఆపాలంటూ జగన్ దీక్ష చేపట్టారని, ఈ రెండు పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ రైతులకు అన్యాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రయత్నాలు విరమించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, ఇందుకు వారే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ తమ ప్రభుత్వాలతో స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తోందని, కానీ ఏపీ సర్కారు ఒంటెత్తు పోకడలు పోతోందన్నారు.

ఈ ప్రాజెక్టుపై ఏమైనా అభ్యంతరాలపై చర్చించుకునేందుకు సిద్ధమని ఏపీ మంత్రి దేవినేని ఉమతో నాలుగైదు సార్లు మాట్లాడినా.. కానీ ఆయన స్పందించడం లేదన్నారు. కడప, విజయవాడ, హైదరాబాద్ ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నా ఆ మంత్రి స్పందించడం లేదన్నారు. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టాలని ప్రయత్నాలు చేస్తే తెలంగాణ సర్కారు చూస్తూ ఊరుకోదు. రేపు ఏదైనా జరిగితే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలేనని స్పష్టం చేశారు. ఇందుకు చంద్రబాబు, జగన్‌లే బాధ్యత వహించాలన్నారు.ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల చెరువుపై రూ. కోటి వ్యయంతో నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్‌కు సోమవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment