తాజా వార్తలు

Saturday, 21 May 2016

సీపీఎం జాతీయ పార్టీ హోదాకు ముప్పు…!

కామ్రేడ్లకు కషాయం లాంటి న్యూస్. బెంగాల్లో దీదీ దెబ్బ నుంచి కోలుకోక ముందే… మరో షాక్ తగలనుంది. ఈ సారి ఎలక్షన్ కమిషన్ నుంచి చేదు వార్త వినే అవకాశం కనిపిస్తోంది. 52 ఏళ్ల పార్టీ చరిత్రలో మొదటిసారి.. జాతీయ హోదా కోల్పోనుంది సీపీఎం. తాజాగా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్న ఈసీ.. సీపీఎంతో పాటు మరికొన్ని పార్టీల లెక్కలు తేల్చనుంది.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు). 1964లో పుట్టిన పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించింది. కొన్ని రాష్ట్రాల్లో పవర్ లోకి వచ్చింది. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించింది. పార్లమెంట్‌లో సైతం హవా నడిపించింది సీపీఎం. అలాంటి కమ్యూనిస్టు పార్టీ.. ఇప్పుడు ప్రజల్లో ప్రభావం కోల్పోవడమే కాదు. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా జాతీయ పార్టీ గుర్తింపు కోల్పోయే దశకు చేరుకుంది.
తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తోంది ఎన్నికల కమిషన్. ఆయా రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు, రాష్ట్రా పార్టీలు సాధించిన సీట్లు, ఓట్ల షేర్‌ను పరిశీలిస్తోంది. ఏదైనా రాజకీయ పార్టీకి జాతీయ హోదా ఉండాలంటే… లోక్‌సభలో కనీసం 11 మంది ఎంపీలు ఉండాలి. అది కూడా మూడు రాష్ట్రాల నుంచి ఎంపీల ప్రాతినిధ్యం కనిపించాలి. లేకపోతే కనీసం నాలుగు రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు పొంది ఉండాలి. 4 రాష్ట్రాల్లో రాష్ట్రపార్టీ హోదా ఉన్నా… జాతీయ పార్టీ గుర్తింపు ఉంటుంది. అయితే, ఇవేవీ సీపీఎంకి ప్రస్తుతం లేవు.
పశ్చిమ బెంగాల్‌, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లోనే సీపీఎంకి రాష్ట్ర పార్టీ గుర్తింపు ఉంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి 9 మంది గెలిచారు. కనీసం ఓట్ల శాతం పరంగా చూసుకున్నా… 3.25శాతం మాత్రమే ఉంది. తాజాగా కేరళలో LDF గట్టెక్కినా, సీపీఎంకి వచ్చిన ఓట్ల శాతం కూడా పరిశీలిస్తారు. ఇక బెంగాల్లో సీపీఎంతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తే.. కామ్రేడ్లు వెనుకబడిపోయారు. ఈసీ నిబంధనలు, పార్టీ పరిస్థితిని బట్టి చూస్తే సీపీఎం జాతీయ పార్టీ గుర్తింపు రద్దయ్యే చాన్స్ ఉంది.
సాధారణంగా ఐదేళ్లకోసారి ఎన్నికల్లో వివిధ పార్టీల పరిస్థితిని చూసి ఈ హోదాను నిర్ణయిస్తారు. అయితే ఇక మీదట ప్రతి రెండు ఎన్నికలకు ఒకసారి దీన్ని పరిశీలించాలని భావిస్తున్నారు. జాతీయ పార్టీ హోదా ఉంటే పలు ప్రయోజనాలు ఉంటాయి. జాతీయ మీడియాలో ప్రచారాలకు ఉచిత ఎయిర్‌టైమ్, 40 మంది వీవీఐపీ ప్రచారకర్తలకు ప్రయాణ ఖర్చులను అభ్యర్థి ఎన్నికల ఖర్చు నుంచి మినహాయిస్తారు. అందుకే రాజకీయ పార్టీలన్నీ.. బలం లేకపోయినా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసి ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ ఉంటాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment