తాజా వార్తలు

Saturday, 28 May 2016

కన్నకూతురిపై ఏడాదిగా లైంగిక దాడి

కన్నకూతురిపైనే ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్న కామాంధుడి ఉదంతం బయటపడింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండల పరిధిలోని పెదపట్నంలంక గ్రామానికి చెందిన గెడ్డం ప్రసాద్.. వావి వరుసలు మరిచి ఈ దురాగతానికి ఒడిగట్టాడు. దీనిపై నగరం పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. ఎస్ఐ జి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కూలి పనులు చేసే ప్రసాద్ భార్య అనంతకుమారి రెండున్నరేళ్లుగా ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటోంది. వారికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కూతురు గుంటూరులో నర్సింగ్ కోర్సు చదువుతుండగా రెండో కుమార్తెకు వివాహమైంది. పదిహేనేళ్ల మూడో కుమార్తె తండ్రితోనే ఉంటోంది. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది.

ప్రసాద్ ఏడాదిగా మూడో కూతురిపై లైంగికదాడి చేస్తున్నాడు. ఆమె ప్రతిఘటిస్తే చంపుతానని బెదిరిస్తూ, అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి, కొట్టి తన కామం తీర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ఆరునెలల గర్భంతో ఉన్న కూతురికి ప్రసాద్ తాటిపాకలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించాడు. అదే రోజు బాధితురాలు జరిగిన దారుణాన్ని కువైట్‌లో ఉన్న తల్లికి ఫోన్‌లో చెప్పింది.
ఆమె శుక్రవారం స్వదేశం చేరుకుని భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగికదాడి, మైనార్టీ బాలికను గర్భవతిని చేయడం, వేధించడం తదితర సెక్షన్లపై కేసు నమోదు చేశారు. కేసును అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ప్రసాద్ ఘాతుకం స్థానికంగా కలకలం రేపింది.
« PREV
NEXT »

No comments

Post a Comment