తాజా వార్తలు

Monday, 16 May 2016

పచ్చిమిర్చి సెంచరీ నాటౌట్

నడి వేసవిలో ఎండలకు తోడు పచ్చిమిర్చి ధర కూడా మండిపోతోంది. వినియోగదారులకు తినకుండానే కంటతడి పెట్టిస్తోంది. ఇప్పటికే కొండెక్కిన నిత్యావసర సరకుల జాబితాలోకి మిర్చి కూడా చేరిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా మిర్చి ధర పెరిగింది. కిలో పచ్చిమిర్చి ధర బహిరంగ మార్కెట్లో వంద నుంచి నూటముప్పై రూపాయలు పలుకుతోంది. రైతు బజార్లలో కూడా పావు కిలో మిర్చి ముప్పై రూపాయల వరకు తీసుకుంటున్నారు. మిర్చి లేకుండా ఏ వంట చేయలేని పరిస్థితి ఉండడంతో ధర ఎంతైనా కొనాల్సి వస్తుందని మహిళలు వాపోతున్నారు. దీనిపై సామాన్య, దిగువ మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వంద గ్రాములతో సరిపెట్టుకుంటున్నాం
గతంలో ప్రతి వారం కూరగాయలు కిలోల చొప్పున, పచ్చిమిర్చి పావు కిలో చొప్పున కొనే వారిమని మహిళలు చెప్పుతున్నారు. కానీ భారీగా పెరిగిన కూరగాయల ధరల వల్ల కూరగాయలు పావు కిలో, పచ్చిమిర్చి వంద గ్రాములతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.
రైతులకు కాసుల పంట
ఇకా ఎప్పుడూ గిట్టుబాటు ధర రాక అల్లాడే రైతన్నలకు మిర్చి ఈ సారి మెదక్ జిల్లా గంగాపూర్ రైతులకు కాసుల పంట పండించింది. గంగాపూర్‌ గ్రామంలో 450 కుటుంబాలు 300 ఎకరాల్లో మిర్చి పంట సాగుచేశారు. తీవ్ర ఎండాల కారణంగా బోర్లు అడుగంటినా కొద్ది పాటి నీటితో స్ప్రింక్లర్లు, నీటి గుంతలు, ఫాంపాండ్‌ల పద్ధతుల ద్వారా పంటలను సాగు చేసి లాభాలను అర్జించారు. మిర్చికి మంచి గిట్టుబాటు ధర వస్తుండటంతో అధిక శాతం మంది రైతులు మిర్చి పంటను సాగు చేస్తున్నారు. గత సంవత్సరం మిర్చికి ధర లేకపోవడంతో కొంత నష్టాలు చూసిన రైతులు ఈ సారి అధిక రేటు వస్తుండటంతో లాభాలను ఆర్జిస్తున్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు సమారు 8 వందల బస్తాలు వస్తున్న ఈ మార్కెట్‌లో రోజుకు రూ. 15 లక్షల వ్యాపారం జరుగుతుండడంతో గ్రామ పంచాయతీకి కూడా మంచి ఆదాయం వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment