తాజా వార్తలు

Saturday, 21 May 2016

టార్గెట్ వైఎస్, జగన్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి దివంగత సీఎం రాజశేఖరరెడ్డిని విమర్శించటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి మహానాడు జరగబోతుంది. దీనికి ముందుగా జిల్లా మహానాడుల్లో చర్చించేందుకు రూపొందించిన ముసాయిదా తీర్మానాలను చూస్తే విషయం అర్థమవుతోంది.పార్టీ రూపొందించిన తీర్మానాల్లో ఎన్‌టీఆర్‌కు నివాళి, పార్టీ 35 ఏళ్ల చరిత్ర తదితర నాలుగైదు తీర్మానాల్లో మినహా ప్రతి దానిలోనూ జగన్, వైఎస్సార్‌పై విమర్శలే ఉన్నాయి. మహానాడుకోసం జాతీయ పార్టీ పరంగా ఆరు, ఏపీకి సంబంధించి 15, తెలంగాణకు సంబంధించి ఏడు  ముసాయిదా తీర్మానాలను రూపొందించారు. తెలంగాణ రాష్ర్ట తీర్మానాల్లో ఆ రాష్ట్ర సీఎం కె. చంద్రశేఖర్‌రావు, ఏపీ తీర్మానాల్లో విపక్షనేత జగన్, ఆయన తండ్రి వైఎస్సార్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. జగన్‌పై విమర్శలు చేసేందుకు 22 పేజీలు కేటాయించడం గమనార్హం.

 ప్రతి తీర్మానంలో విమర్శలే
 టీడీపీ ప్రభుత్వం ఏపీలో 2014 జూన్ 8 న అధికారం చేపట్టింది మొదలు ఇప్పటివరకూ చేపట్టిన ఏ పనిని జగన్ స్వాగతించలేదని తీర్మానాల ముసాయిదాలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పని, నిర్ణయాన్ని  ఆయన అడ్డుకున్నారని, విదేశాల నుంచి పెట్టుబడులు రాకుండా లేఖలు రాశారని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం తన పొరుగున ఉన్న ఏపీ రాష్ర్ట సీఎం ఫోన్ ట్యాప్ చేసినా జగన్ స్పందించలేదని ఆక్షేపించారు. టీడీపీ ప్రభుత్వ అవినీతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన పుస్తకం, సాక్షి పత్రికలో వచ్చిన కథనాలు కావాలని చేస్తున్న పనులని తప్పించుకునే ప్రయత్నం చేశారు.  జగన్ నేతృత్వంలో  చేపట్టిన ఆందోళనలను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించారు. తెలంగాణ ప్రభుత్వంపై కూడా విమర్శలకే మహానాడు తీర్మానాలను ఉపయోగించుకున్నారు.
 
 అతిథులకు టీటీడీ గదులు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలో జరిగే మహానాడుకు హాజరయ్యే అతిథులు, ఆహ్వానితులకు టీటీడీ గదులు రిజర్వ్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ద్వారా గదులను రిజర్వ్ చేసుకునే ప్రక్రియ మొదలైనట్లు తెలిసింది. వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తులకు గదులు దొరకడం గగనమైంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాల్లో బస చేసేందుకు వేలాదిమంది యాత్రికులు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ నెల 27, 28, 29 తేదీల్లో గదుల ఖాళీలు లేనట్లు ఆన్‌లైన్‌లో సూచిస్తుండటంతో నాలుగు రాష్ట్రాల యాత్రికులు నానా తంటాలు పడాల్సి వస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment