తాజా వార్తలు

Sunday, 22 May 2016

'నిర్భయ తరహాలో రేప్ చేస్తామన్నారు'

ఎన్డీఏ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియంకా చతుర్వేది ఆరోపించారు. మహిళలకు భద్రత కల్పించడంలో నరేంద్ర మోదీ సర్కారు విఫలమైందని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరిగాయని, వీటిని నివారించేందుకు సరైన చట్టాలు లేవని వాపోయారు. సామాజిక మాధ్యమాల్లో మగువలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి రాసిన వ్యాసంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

తనకు కూడా బెదిరింపులు వచ్చాయని ప్రియంక వెల్లడించారు. నిర్భయ తరహాలో రేప్ చేసి చంపుతామని ట్విటర్ లో తనను హెచ్చరించారని చెప్పారు. ప్రముఖ నాయకురాలైన తనకే ఇలాంటి బెదిరింపులు వస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ తనకు ఉందని స్పష్టం చేశారు. హిందూ సంస్థలకు చెందిన మద్దతుదారులు తనను బెదిరించారని, ఇలాంటి హెచ్చరికలను తాను లెక్కచేయబోనని చెప్పారు. తనకు వచ్చిన బెదిరింపులను గురించి మళ్లీమళ్లీ మాట్లాడుతూనే ఉంటానన్నారు. తనను బెదిరించిన వాళ్లు బెయిల్ పై విడుదలైనా కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తానని అన్నారు.

తనను భయపెట్టిన వ్యక్తిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు ఎంతో సహకరించారని చెప్పారు. తనకు బెదిరింపులు కొత్త కాదని, పోలీసులను ఆశ్రయించడం మొదటిసారి కాదని గుర్తు చేశారు. ఆన్ లైన్ లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు పటిష్టమైన చట్టాలు రూపొందించాలని ఆమె కోరారు. బీజేపీ నాయకులు మాటలు కట్టిపెట్టి మహిళా భద్రతపై దృష్టి సారించారని సలహాయిచ్చారు. సైబర్ వేధింపులు నివారించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. మహిళల రక్షణపై ప్రభుత్వ చిత్తశుద్ధికి జైట్లీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని మండిపడ్డారు.
« PREV
NEXT »

No comments

Post a Comment