తాజా వార్తలు

Sunday, 22 May 2016

రేపట్నుంచే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 4,73,450 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో ఫస్టియర్ పరీక్షలకు 3,02,227 మంది హాజరు కానుండగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1,59,803 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఇం టర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఈ నెల 24 నుంచి 31 వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 799 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ (040-24601010/24732369)ను ఏర్పాటు చేసినట్లు అశోక్ తెలిపారు.

విద్యార్థులు పరీక్ష ప్రారంభ సమయంకంటే గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమన్నారు. పరీక్షల నిర్వహణ నిమిత్తం అన్ని జిల్లాల్లో ఆర్‌ఐవోలు కన్వీనర్‌లుగా జిల్లా పరీక్షల కమిటీ(డీఈసీ)లను ఏర్పాటు చేశామని, పరీక్షాకేంద్రాల్లో తనిఖీల నిమిత్తం విద్య, రెవెన్యూ, పోలీసుశాఖలకు చెందిన సిబ్బందితో 50 ఫ్లయింగ్, 200 సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించామన్నారు. కాపీయింగ్‌ను ప్రోత్సహించే అధికారులు లేదా విద్యా సంస్థలపై సెక్షన్ 25 ప్రకారం కఠిన చర్యలు చేపడతామని అశోక్ హెచ్చరించారు. జూన్ 1 నుంచి మూల్యాంకనం చేపడతామని, జూన్ 25లోగా ఫలితాలను వెల్లడించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

సీసీ కెమెరాల నిఘాలో..
ఇంటర్ పరీక్షలు ప్రప్రథమంగా సీసీటీవీ కెమెరాల నీడలో జరగనున్నాయి. పరీక్షాకేంద్రాల్లో ఇప్పటికే 90 శాతం సీసీ కెమెరాలు ఏర్పాటు జరిగిందని, రెండ్రోజుల్లో వంద శాతం పనులు పూర్తవుతాయని బోర్డు కార్యదర్శి తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో ఆయా కేంద్రాల్లోని సీసీ కెమెరాల ఐపీ నెంబర్లను తీసుకొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు నేరుగా పర్యవక్షిస్తారని చెప్పారు. అవసరమైతే రికార్డు అయిన సీడీలను తెప్పించుకొని పరిశీలిస్తామన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment