తాజా వార్తలు

Monday, 16 May 2016

నాసా వదిలేసింది… ఇస్రో ప్రారంభిస్తోంది…

అంతరిక్ష ప్రయోగాల్లో అత్యధిక సెక్సెస్‌ రేట్‌తో దూసుకెళ్తున్న ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ – ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమౌతోంది. ఇప్పటికే కారు చౌకగా అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపుతున్న ఇస్రో.., ఆ ఖర్చును పది రెట్లు తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. అంతరిక్షంలోని నిర్ణీత కక్ష్యలో ఉపగ్రహాల్ని విడిచిపెట్టిన తర్వాత తిరిగి వచ్చే వాహక నౌక రూపొందించే పనిలో నిమగ్నమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని తయారు చేస్తోంది.
ఇంత వరకూ ఇస్రో ఉపయోగిస్తున్న స్పేస్‌ షిప్‌లు, ఉపగ్రహాలను కేవలం అంతరిక్షంలో విడిచిపెట్టడానికి ఉపయోగపుడుతున్నాయి. ఈ పద్ధతిలో అంతరిక్ష ప్రయోగం చేసే ప్రతిసారి కొత్త రాకెట్లను సిద్ధం చేయాలి. దీనికి భిన్నంగా పదే పదే అంతరిక్ష ప్రయోగాలకు వినియోగించుకునే విధంగా స్పేస్‌ షటిల్‌ను తయారు చేసే పనిలో పడింది ఇస్రో. ఈ నెలలోనే శ్రీహరి కోట రాకెట్‌ ప్రయోగ కేంద్రంలో మొదటి పునర్వినియోగ వ్యోమ నౌకకు పరీక్షించనుంది ఇస్రో. ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే కక్ష్యలోకి పంపడానికి అయ్యే ప్రతి కేజీకి లక్షా 30 వేల రూపాయల కంటే తక్కువ అవుతుందంటున్నారు ఇస్రో ఇంజనీర్లు. గతంలో అమెరికా ఇటువంటి స్పేస్‌ షటిల్‌ను ఉపయోగించినా, తర్వాత కొన్ని కారణాలతో వీటికి స్వస్తి చెప్పింది. అయితే ప్రస్తుతం జరుగుతున్నది తొలి దశ ప్రయోగం మాత్రమే. ఈ ప్రయోగం విజయవంతమైతే పూర్తిస్థాయి వాహకనౌక సిద్ధం కావడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. ఈ ప్రాజెక్టు కోసం ఇంత వరకూ 95 కోట్లు ఖర్చు చేసింది ఇస్రో.
« PREV
NEXT »

No comments

Post a Comment