తాజా వార్తలు

Saturday, 21 May 2016

టీఆర్‌ఎస్‌పై ఇంకా భ్రమలున్నాయి

టీఆర్‌ఎస్‌పై ప్రజలకు ఇంకా భ్రమలున్నాయని సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి వాఖ్యానించారు. శుక్రవారం  ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేయాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. పాలేరులో విజయం సాధించిన తుమ్మల నాగేశ్వర్‌రావుకు ఆయన శుభాకాంక్షలను తెలియజేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని జానారెడ్డి అన్నారు. ఈ ఓటమితో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరాశచెందాల్సిన అవసరం లేదన్నారు. ఓడిపోయినప్పుడు నిరాశ, బాధ సహజమే అయినా కాంగ్రెస్ శ్రేణులు ఈ ఓటమిని సవాలుగా తీసుకుని గెలుపుకోసం కష్టపడాలని సూచించారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతం కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని అన్నారు. చట్టం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాల్సిన అవసరం లేదని జానా అన్నారు. చట్ట విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా, మాట్లాడినా కేసులు పెట్టడం సహజమన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌పై నమ్మకం వచ్చేదాకా వేచి చూస్తామని జానారెడ్డి చెప్పారు.

 జానాతో లక్ష్మణ్ భేటీ
 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ శుక్రవారం సీఎల్పీ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో వీరు సుమారు పావుగంటపాటు సమావేశమయ్యారు. పాలేరు ఎన్నిక ఫలితాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్ష పార్టీలు, నేతలపై మాట్లాడిన తీరును వీరు చర్చించుకున్నట్టుగా తెలిసింది.
« PREV
NEXT »

No comments

Post a Comment