తాజా వార్తలు

Saturday, 21 May 2016

'టీడీపీ మహానాడును అడ్డుకుంటాం'

తిరుపతిలో నిర్వహించే టీడీపీ మహానాడులో ఎస్సీ వర్గీకరణపై చర్చించి తగు తీర్మానం చేయకపోతే మహానాడు కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఏపీ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు హెచ్చరించారు. శుక్రవారం ఏలూరులో నిర్వహించిన రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. మహానాడు తొలిరోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు.

రెండో రోజున ఎన్టీఆర్ విగ్రహాల వద్ద నిరసన దీక్షలు చేస్తామని, అప్పటికీ వర్గీకరణపై తీర్మానం చేయకపోతే ఛలో తిరుపతి కార్యక్రమం నిర్వహించి మహానాడు వేదిక వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎటువంటి ఘటనలు జరిగినా అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై ఇంకా అలసత్వం వహిస్తే జూన్ 30న అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో లక్ష మందితో దండయాత్ర మహాసభ నిర్వహిస్తామన్నారు.

ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జన్ని రమణయ్య మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై చర్చించి తీర్మానం చేయకపోతే 2019 ఎన్నికల అనంతరం చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెడతామన్నారు. వర్గీకరణకు బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా వర్గీకరణపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో ఏపీ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి పొలిమేర హరికృష్ణ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీరామ దేవమణి, రాష్ట్ర యువసేన అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు, జాతీయ కో కన్వీనర్ కలివెల ఎలీషా, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బుంగా సంజయ్, ఏపీఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె లాజరస్, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ఉందుర్తి సుబ్బారావు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment