తాజా వార్తలు

Sunday, 22 May 2016

మంత్రి నారాయణ X సీఆర్‌డీఏ కమిషనర్

రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) వ్యవహారాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, కమిషనర్ శ్రీకాంత్ నడుమ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. గత కొద్ది కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం మంత్రి నారాయణ కొద్ది రోజుల క్రితం రాసిన లేఖ ఆజ్యం పోసినట్లై భగ్గుమంది. రాజధాని ప్రాంత గ్రామాల్లో సభలు నిర్వహణ, చెక్కుల పంపిణీ విషయాల్లో వీరి మధ్య మొదలైన మనస్పర్థలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయి.

తాజాగా సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ తాత్కాలిక సచివాలయం వద్దకు విధిగా వెళ్లాలని, రోజులో కనీసం పదిగంటలైనా నిర్మాణ ప్రాంతంలో పర్యవేక్షించాలని మంత్రి లేఖ రాయడంతో వ్యవహారం భగ్గుమంది. మంత్రి  రాసిన లేఖ వ్యంగ్యంగా ఉందని, కమిషనర్ శ్రీకాంత్ మనస్తాపానికి గురయ్యారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  మంత్రి లేఖపై కమిషనర్ శ్రీకాంత్ నేరుగా సీఎంకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే విషయం చాలా సాధారణమైందని, దీనిపై రాద్ధాంతం అనవసరమని మంత్రి పేషీ అధికారులు చెబుతున్నారు. అయితే వారి మధ్య ఇప్పటికే భేదాభిప్రాయాలు ఉన్న నేపధ్యంలో ప్రాధాన్యత చోటుచేసుకుంది.

కాగా రాజధాని వ్యవహారాలైన సచివాలయం టెండర్లు, అధికారుల విదేశీ పర్యటనలతో పలు ఆరోపణలు మంత్రిపై వెల్లువెత్తుతున్నాయి. గతంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా మంత్రి నారాయణ విషయంలో కినుకు వహించారు. రెవెన్యూ వ్యవహారాల్లో మంత్రి నారాయణ జోక్యాన్ని పలు సందర్భాల్లో కేఈ  తప్పుపట్టారు. ఇప్పుడు అధికార వర్గాలతోనూ మంత్రి నారాయణ తీరుపై విసృ్తత చర్చ జరుగుతోంది.  
« PREV
NEXT »

No comments

Post a Comment