తాజా వార్తలు

Saturday, 14 May 2016

పీవీపై బురద జల్లిన సీఎం

బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో పీవీ నరసింహారావుకు తాను లేఖ రాసినా ఆయన పట్టించుకోలేదంటూ అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ బురద చల్లారు. ఆయనకు పార్టీ మీద పట్టు లేదన్నారు. బాబ్రీ కూల్చివేత సమయానికి ఆహారశాఖ మంత్రిగా ఉన్న తరుణ్ గొగోయ్.. అప్పటి పరిస్థితిలో పీవీ వ్యవహరించిన తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'టర్న్ ఎరౌండ్ - లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్' అనే పేరుతో తాను రాసిన పుస్తకంలో గొగోయ్ ఈ విషయం చెప్పారు. 1992 డిసెంబర్ నెలలో బాబ్రీ కూల్చివేత సమయంలో పీవీ వ్యవహరించి తీరు సరికాదన్నారు. పీవీ చాలా ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి అని, ఆయన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, ఏనాడూ మంత్రుల పనిలో వేలుపెట్టేవారు కారని చెప్పారు. ఆహార శాఖ మంత్రిగా కూడా తన నిర్ణయాలన్నీ తానే తీసుకునేవాడినని చెప్పారు. 2001 నుంచి ఇప్పటివరకు అసోం ముఖ్యమంత్రిగా ఉంటున్న గొగోయ్.. తన రాజకీయ జీవితంలోని ముఖ్యాంశాలతో ఈ పుస్తకం రాశారు.

అయితే పీవీకి పార్టీ మీద అంతగా పట్టు లేదని, మంత్రిగా తనకున్న పరిమితులు కూడా దాటి తాను ఆయనకు ఒక లేఖ రాశానని, మైనారిటీ నేతలను ఆయన విశ్వాసంలోకి తీసుకుని ఉండాల్సిందని గొగోయ్ రాశారు. మసీదు కూల్చివేత తర్వాతే మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని.. అయితే ఆయన తన లేఖకు స్పందించలేదని అన్నారు. కోకా కోలా, పెప్సీ లాంటి బహుళ జాతి సంస్థలను భారతదేశంలోకి అనుమతించినది తానేనని గుర్తుచేసుకున్నారు. దానిపై ప్రతిపక్షాలు విమర్శించినా.. తాను మాత్రం ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు.

« PREV
NEXT »

No comments

Post a Comment