తాజా వార్తలు

Friday, 27 May 2016

‘రాయుడు’ సినిమా రివ్యూ…

మాస్ ఆడియన్స్ లో మాంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ కథానాయకుడు విశాల్. విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ, వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న విశాల్ నటించిన తాజా చిత్రం “మరుదు”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం “రాయుడు” పేరుతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన తెలుగమ్మాయి శ్రీదివ్య కథానాయకిగా నటించిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రేక్శకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
రాయుడు (విశాల్) ఓ మార్కెట్ కూలీ. మొరటోడే కానీ… తన అమ్మమ్మ పెంపకం పుణ్యమా అని ఆడవారంటే అమితమైన గౌరవం, పెద్దలంటే అభిమానం మాత్రం ఉంటాయి. తన కళ్ల ముందు ఎటువంటి అన్యాయం జరుగుతున్నా సహించలేని వ్యక్తి రాయుడు. భాగ్యలక్ష్మి (శ్రీదివ్య) అదే మార్కెట్ పరిధిలో నివసించే నవతరం యువతి. తన తల్లిని రోలెక్స్ బాచి (ఆర్.కె.సురేష్) కారణంగానే మృతి చెందిందని కోర్టులో కేసు వేసి… తన స్థాయి మేరకు పోరాడుతుంటుంది. మరి భాగ్యలక్ష్మి కోర్టు కేసు గెలవడానికి రాయుడు ఈ విధంగా సహాయపడ్డాడు. రోలెక్స్ మరియు రాయుడు మధ్య ఉన్న వివాదం ఏంటీ? అనేది సినిమాలో మెయిన్ పాయింట్.
నటీనటుల పనితీరు
ఇదివరకు “పందెం కోడి, పొగరు” వంటి సినిమాల్లో ఊర మాస్ యాక్షన్ తో అదరగొట్టిన విశాల్ మరోమారు “రాయుడు”గానూ అదే స్థాయిలో మెప్పించాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ లో విశాల్ స్పాంటానిటీ ఆకట్టుకుంటుంది. ధీరవనిత భాగ్యలక్ష్మి పాత్రలో శ్రీదివ్య ఫర్వాలేదనిపించుకుంది. పాత్రలో బరువు ఉన్నప్పటికీ.. ఆమె కళ్ళతో పలికించాల్సిన హావభావాలు తేలిపోతుంటాయి. చాలా నీరసంగా కనిపిస్తుంటుంది.
బాల దర్శకత్వంలో తెరకెక్కిన “తారై తప్పట్టై” చిత్రంలో ప్రతినాయకుడిగా వీరాలెవల్లో విజృంభించిన ఆర్.కె.సురేష్ “రాయుడు” సినిమాలోనూ తనదైన శైలిలో విలనిజాన్ని పండించాడు. అతడి నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండనడంలో అతిశయోక్తి లేదు. సూరి కామెడీ పంచులు పెద్దగా పేలకపోయినా.. ఓ మోస్తరుగా నవ్వించగలిగాడు. రాధారవి, లీలాలు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకొన్నారు.
సాంకేతికవర్గం పనితీరు
ఇమ్మాన్ అందించిన బాణీలు తెలుగువారికి ఎక్కకపోవచ్చు. కానీ నేపధ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా ఫైట్ సీన్స్ లో వచ్చే బీజీఎం సినిమాకి హైలైట్. ప్రవీణ్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పిగా ఉంటే బాగుండేది. ఫైట్స్ సీన్స్ కాస్త శృతి మించాయి. ఈ సినిమాకి యు/ఎ ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోక తప్పదు. శశాంక్ వెన్నెలకంటి ఎప్పట్లాగే తనదైన శైలి సంభాషణలతో అలరించాడు.
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం
ముత్తయ్య రాసుకొన్న కథలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. భాగ్యలక్ష్మి తల్లి మరణాన్ని రాయుడికి లింక్ చేయడం, మార్కెట్ గొడవల్లో రాజకీయాలు ఇరికించాలని చూడడం వంటివి చాలా అసహజంగా అనిపిస్తుంటాయి. అయితే.. సదరు లూప్ హోల్స్ ను యాక్షన్ బ్లాక్స్ తో ఫిల్ చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు. కొంతమేరకు సఫలం అయ్యాడనుకోండి.
విశ్లేషణ
సినిమాకు మహారాజా పోషకులైన మాస్ ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించిన చిత్రం “రాయుడు”. అందువల్ల ఈ సినిమా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు కనెక్ట్ కాకపోవచ్చు. సో.. కథను, కథలోని పాత్రలను ఎక్కువగా పట్టించుకోకుండా.. కేవలం ఓ రెండు గంటల యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ కోసం సినిమా చూడాలనుకొనేవారిని మాత్రమే సంతృప్తి పరిచే చిత్రం “రాయుడు”.
« PREV
NEXT »

No comments

Post a Comment