తాజా వార్తలు

Thursday, 19 May 2016

'ఆ ముగ్గురు సర్కస్ లో జంతువులు'

తెలంగాణలో కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారని, ఆయన పాలనకు చమరగీతం పాడాల్సిన రోజులు దగ్గరకు వచ్చాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. గురువారం నిజామాబాద్‌లో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తే అసెంబ్లీ నుంచి 30 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి, పిరికిపంద చర్యలకు పూనుకున్నారని విమర్శించారు. కేసీఆర్ స్వార్థ రాజకీయాలను టీడీపీ ఎండగడుతోందని, ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజల కోసం పోరాడుతుందన్నారు.

కార్యక్రమలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీలో ఉండి పేరు, ప్రతిష్టలు పొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరి సర్కస్‌లో జంతువుల్లా తయారయ్యారని విమర్శించారు. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పక్కన పెట్టి, వాటికి రీ డిజైనింగ్ పేరుతో మసిపూసి మారేడు కాయ చేస్తున్నారన్నారు. మామ, అల్లుడు ఇద్దరు కలసి ప్రాజెక్టుల పేరుతో నాటకాలు ఆడుతున్నారని, రూ. లక్షా 50 వేల కోట్లతో టెండర్లు పిలిచి అందులో 10 శాతం కమీషన్లు పొందుతున్నారని ఆరోపించారు. ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ వద్దన్న కేసీఆర్.. తన కుటుంబంలో మాత్రం నలుగురికి పదవులు కట్టబెట్టి లక్షలాది రూపాయల వేతనాలు పొందడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు అరికెల నర్సారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నపూర్ణమ్మ, మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment