తాజా వార్తలు

Monday, 30 May 2016

బరితెగించి కొనుగోళ్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాల్లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు కోట్ల రూపాయలిస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు మరోసారి ప్రజాస్వామ్యాన్ని పాతరేసేందుకు సిద్ధమయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనుంచి ఇద్దరి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతాపార్టీకి మరో సీటును ఇచ్చారు. ప్రస్తుతం టీడీపీకి ఉన్న బలం మేరకు మూడు సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉంది.
అయినప్పటికీ బలం లేకపోయినా బీజేపీని సాక్షిగా పెట్టి దొడ్డిదారిన నాలుగో అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి, ఆ సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో వారిని అడ్డు పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో ఆధారాలతో అడ్డంగా దొరికి ఏడాదైనా ఎలాంటి చర్యలూ లేకపోవడంతో ఇప్పుడు మరింత బరితెగించి బహిరంగంగా అక్రమాలకు పాల్పడుతున్నారు.

ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికీ రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసిన రీతిలోనే మరికొందరిని కొనుగోలు చేసి రాజ్యసభకు నాలుగో అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే నాలుగో అభ్యర్థి విషయమై పార్టీలో చేరిన 17మంది ఎమ్మెల్యేలే నిర్ణయం తీసుకుంటారని డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ఫిరాయింపులను ప్రోత్సహించి, అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, మహానాడు సాక్షిగా వారిని వేదికపై కూర్చోపెట్టి... ఇప్పుడు నాలుగో అభ్యర్థిపై వారే నిర్ణయం తీసుకుంటారనడం చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనం. రెండుసార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ప్రతిపక్ష నేతగా పనిచేశానని, రాజకీయాల్లో 40 ఏళ్ల చరిత్ర ఉందని నిత్యం చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడటంపై రాజకీయ విశ్లేషకులు విస్తుపోతున్నారు. బలం లేకపోయినా అభ్యర్థిని బరిలోకి దింపడమంటే కొనుగోళ్లకు తెరలేపినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు.

 ఫిరాయింపుదారులతో ఓట్లు వేయించే కుట్ర
 ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, తీర్పునిచ్చిన ప్రజలను ఎగతాళి చేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పచ్చకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు వారితో రాజీనామా చేయించేందుకు ఏనాడూ ప్రయత్నించలేదు. మరోవైపు తమ పార్టీనుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ పదేపదే విజ్ఞప్తులు చేసినా ఇప్పటివరకూ స్పీకర్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మళ్లీ గెలిపించగలమనే నమ్మకం లేకపోవడంతోనే ఫిరాయింపుదారులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలుస్తోంది. ఇప్పుడు వారితోనే దొడ్డిదారిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయించే ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఓటు వేసే అర్హత లేదని ఉత్తరాఖండ్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టంచేసినా ఖాతరు చేయకుండా ప్రజాస్వామ్య హననానికి పాల్పడేందుకు రాజ్యాంగ వ్యవస్థలను సైతం నిర్భీతిగా వాడుకునేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

 మండిపడ్డ వైఎస్సార్‌సీపీ
 రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా సాగిస్తున్న దిగజారుడు రాజకీయాలపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. దేశంలో తనకంటే నిజాయితీపరుడు లేడని మహానాడులో గొప్ప లు చెప్పుకున్న చంద్రబాబు ఒక్కరోజు తేడాలోనే అందుకు విరుద్ధంగా వ్యవహరించ డం ఆయన నయవంచక నైజానికి నిదర్శనమని విమర్శించింది. ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కాళ్లు పట్టుకుని కేసు నుంచి బయటపడ్డారని, ఇప్పుడు ఏపీలో తననెవ్వరూ ఏమీ చేయలేరనే ధీమాలో రాజ్యసభ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. రూ.వందల కోట్లు కుమ్మరించి అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న దురుద్దేశం కాకపోతే నాలుగో అభ్యర్థిని ఎందుకు నిలబెడుతున్నారని ప్రశ్నించా రు. నాడు సొంతమామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఓట్లేసిన ప్రజలను రెండేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
« PREV
NEXT »

No comments

Post a Comment