తాజా వార్తలు

Saturday, 14 May 2016

టీఆర్‌ఎస్ నిరంకుశత్వాన్ని అడ్డుకోవాలి

‘ఓ ఎమ్మెల్యే చనిపోతే సంప్రదాయంగా ఆ కుటుంబంలో పోటీచేసే వారికి మద్దతునివ్వాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే పాలేరులో రాంరెడ్డి సుచరితారెడ్డికి మా పార్టీ మద్దతు ప్రకటించింది. అయితే ఈ సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చిన అధికార పార్టీ.. అభ్యర్థిని బరిలోకి దింపింది. అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలేలా, నిరంకుశత్వాన్ని అడ్డుకునేలా పాలేరు నియోజకవర్గ ఓటర్లు సుచరితారెడ్డికి ఓటు వేయాలి’. అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మంలో వారు విలేకరులతో మాట్లాడారు.

ఈ ఎన్నికల్లో భర్తను పోగొట్టుకున్న మహిళ ఓ వైపు, అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకవైపు బరిలో నిలిచారని, పాలేరు ప్రజలు దీన్ని గమనించి సుచరితారెడ్డికి ఓటు వేసి రాంరెడ్డి వెంకటరెడ్డికి నివాళి అర్పించాలన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాయని, ఆమె విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఓటు వేసి ప్రజలు గెలిపిస్తే కన్నతల్లి లాంటి పార్టీని కాదని, అభివృద్ధి కోసమం టూ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, కొత్తగా ఆ నియోజకవర్గాలకు ఏమైనా నిధులు కేటాయించారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఇక్కడి ప్రజల ఆస్తి, హక్కులు ఒక్క టీఎంసీ నీళ్లను ఎవరు గుంజుకున్నా వైఎస్సార్‌సీపీ పోరుబాట పడుతుందన్నారు.

 స్పీకర్ వ్యవస్థ అధ్వానంగా మారింది..
 టీఆర్‌ఎస్ రాజకీయ విలువలను కాలరాస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ విమర్శించారు. ‘వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన మదన్‌లాల్ టీఆర్‌ఎస్‌లో చేరితే ఆయనపై చర్య తీసుకోవాలని స్పీకర్‌కు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు వినతి అందజేశారు. అదే తాటి టీఆర్‌ఎస్‌లో చేరితే వారిద్దరిపై చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పాయం కూడా టీఆర్‌ఎస్‌లో చేరి.. ఈ ముగ్గురు మేమందరం ఒకే పార్టీకి సంబంధించిన వాళ్లమని, టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నామంటే వారం రోజుల్లోనే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

రెండేళ్లలో వెంటనే తీసుకోని నిర్ణయాలు, వీరి విషయంలో వెంటనే తీసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం స్పీకర్ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తుందనడానికి ఇదే నిదర్శనం’ అని అన్నారు. రాజీనామాలు చేయకుండా మంత్రి పదవులను అనుభవిస్తూ.. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో రాంరెడ్డి వెంకటరెడ్డిని ఎస్సీ,బీసీ, మైనార్టీ వర్గాలు అపారంగా ప్రేమిస్తున్నాయన్నారు. సుచరితారెడ్డికి ఓటేసి టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మెండెం జయరాజు, నేతలు పచ్చిపాల వేణు, పోకల అశోక్, వేముల శేఖర్‌రెడ్డి, ఎండి. రఫీక్, బొప్పా సునీల్‌రెడ్డి, సంద రవి తదితరులు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment