తాజా వార్తలు

Saturday, 28 May 2016

అవినీతిని రూపుమాపుతాం...

కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం చేస్తున్న పనులతో దేశంలో స్పష్టమైన మార్పు కనబడుతోందన్నారు. పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రతిక్షణం పాటు పడుతున్నామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద ‘ఏక్ నయీ సుబహ’ (ఒక నవోదయం) పేరుతో ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొన్నారు. అంగరంగవైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి కేంద్ర మంత్రులు లైవ్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండేళ్లలో అవినీతి ఊసు లేకుండా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే పనులు చేపట్టామన్న ప్రధాని.. దేశాభివృద్ధికి ‘టీం ఇండియా’లా పనిచేస్తున్నామన్నారు. ‘మేం అధికారంలోకి వచ్చేటప్పటికీ అవినీతి చీడ దేశాన్ని పీల్చి పిప్పిచేసింది. మేం అవినీతిని వీలైనంత పారద్రోలాం. మిగిలింది రూపుమాపుతాం. కానీ ఒకటి వాస్తవం. ఇన్నాళ్లూ అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారు ప్రజల సొమ్మును తమ ఇష్టానికి వాడుకున్నారు’ అని అన్నారు.

 ప్రజల ఆశీర్వాదం ఉంది
 దేశంలో 15 రోజులుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలపై సునిశిత సమీక్ష జరుగుతోందన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలపై చర్చించుకోవటం.. ప్రభుత్వంలో మరింత ఉత్సాహాన్ని పెంచిందని మోదీ తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రోజురోజుకూ సరికొత్త విశ్వాసంతో పనిచేస్తున్నామన్నారు. ధైర్యంగా, సంతోషంగా ప్రజలముందు నిలబడ్డామన్నారు. కొందరు రాజకీయ అవసరాల కోసం పనిగట్టుకుని విమర్శిస్తున్నారన్న మోదీ.. వారు లేవనెత్తిన వ్యతిరేక నినాదం ముందు.. తమ ప్రభుత్వ అభివృద్ధి నినాదాన్నే ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. వారు వ్యతిరేకిస్తే బాధలేదని.. కానీ సమాజంలో నిరాశ, నిస్పృహలను పెంచేందుకు చేస్తున్న ప్రయత్నమే బాధకలిగిస్తోందన్నారు.

 అవినీతిని వెలికితీసినందుకే
 తమ ప్రభుత్వం చేస్తున్న పనిని గత ప్రభుత్వంతో పోల్చుకోవటం సహజమని.. అంతమాత్రాన ప్రజలను అయోమయానికి గురిచేయటం సరికాదన్నారు. ‘గత ప్రభుత్వం బొగ్గు కుంభకోణానికి పాల్పడింది. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని వాటిని రద్దుచేయాల్సి వచ్చింది. మేం అధికారంలోకి వచ్చాక పారదర్శక విధానంతో అవినీతికి అడ్డుకట్ట వేశాం. దీంతో ప్రభుత్వానికి వేల కోట్లలో ఆదాయం సమకూరుతోంది’ అని ప్రధాని తెలిపారు. అవినీతిని వెలికితీస్తున్నందుకే తమ ప్రభుత్వంపై కక్ష గట్టారన్నారు. వచ్చే తరాలకు ఆత్మవిశ్వాసాన్నిచ్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. టీం ఇండియా ప్రేరణతో.. రాష్ట్రాలను కలుపుకుని ముందుకెళ్తున్నామని.. దేశాభివృద్ధిలో రాష్ట్రాలనూ భాగస్వాములను చేయాలనేదే తమ ఉద్దేశమన్నారు. ‘ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరగాలి.

గత ప్రభుత్వాలు ఈ దిశగా ప్రయత్నించలేదు. మేం ప్రజలను నమ్మాం. ఇది వారి దేశమే కదా. వారు కూడా మమ్మల్ని నమ్ముతున్నారు. అసలు మేమేం చేస్తున్నామో వారికి వివరిస్తాం’ అని ప్రధాని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పాప తల్లికడుపులో ఉన్నప్పుడే ఆమె రికార్డుల కెక్కేదని.. అంతలోనే ఆమె పేరుతో వితంతు పింఛన్లు కూడా తీసుకున్నారని ఇలాంటి ఎన్నో కేసులు బయటపడ్డాయన్నారు. మధ్యవర్తులు వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని కాజేశారని,జన్‌ధన్ యోజన ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నిధులు చేరటంతో వీరి జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు.

 లీకేజీని అరికడితే వేల కోట్ల మిగులు
 కోటీ 62 లక్షల నకిలీ రేషన్ కార్డులను ఏరివేసి.. ఈ మొత్తాన్నిపేదలకు అందజేస్తున్నామన్నారు. ఎల్పీజీ సిలిండర్లలో లీకేజీని అరికట్టడం వల్ల ప్రభుత్వానికి రూ.15వేల కోట్ల రూపాయలు మిగిలాయని మోదీ వెల్లడించారు. ప్రభుత్వ పథకాల్లో లీకేజీని అరికట్టడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 36వేలకోట్లు మిగిలాయన్నారు. దేశవ్యాప్తంగా 500 నగరాల్లో ఎల్‌ఈడీ బల్బుల వినియోగం జరిగితే.. 20వేల మెగావాట్ల విద్యుత్ (రూ.లక్షకోట్లు ఆదా) మిగిలిపోతుందని.. త్వరలోనే దీన్ని సాధించి చూపిస్తామని మోదీ తెలిపారు. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ వదులుకొమ్మన్న చిన్న పిలుపుతో.. కోటిమంది భారతీయులు స్పందించారని.. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఐదుకోట్ల కొత్త కనెక్షన్లు ఇస్తున్నామన్నారు.
 
 నల్లధనం తీసుకురావటంలో వెనక్కు తగ్గలేదు. ఆ దిశగా విచారణ సంస్థలు పనిచేస్తున్నాయి. దేశంలో నల్లధనాన్ని అరికడుతున్నాం. పనామా పేపర్స్ లీకేజీపైనా విచారణ జరుగుతోంది. సానుకూల రుతుపవనాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది.
 - అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక  మంత్రి
 
 కేంద్రం చేపట్టిన పథకాలు పేదలకు మరీ ముఖ్యంగా దళితులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. విద్యుదీకరణ కార్యక్రమం ద్వారా చాలా గ్రామాల్లో వెలుగులు నింపాం.
 -రామ్‌విలాస్ పాశ్వాన్, ఆహార శాఖ మంత్రి
 
 చిన్నారులు, స్త్రీలలో పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు అంగన్‌వాడీలను బలోపేతం చేశాం. చిన్నారుల సంక్షేమం వారి ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం.
 - మేనకా గాంధీ, కేంద్ర మంత్రి

 దేశంలో ప్రతిఏడాది పుడుతున్న వారిలో 30 శాతం మందికి వ్యాధి నిరోధక శక్తి లోపిస్తోంది. ఇలాంటివారికోసం మేం ప్రారంభించిన ‘ఇంద్రధనుష్’ కార్యక్రమం ద్వారా అందరికీ వ్యాధినిరోధక టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇది పేదలకు ఓ వరంలా మారింది.
 - జేపీ నడ్డా, కేంద్ర ఆరోగ్య మంత్రి
 
 వేదికపై అమితాబ్...
 కేంద్ర ప్రభుత్వం రెండో ఏడాది సంబరాల సందర్భంగా ఏర్పాటుచేసిన వేదికపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. ‘బేటీ బచావ్ బేటీ పఢావ్’ కార్యక్రమం గురించి వివరించారు. జ్ఞానానికి సరస్వతి, సంపదకు లక్ష్మీదేవి, దుర్గ, కాళికాదేవి శక్తికి ప్రతీకలని.. ప్రతి మహిళా ఓ శక్తి రూపమన్నారు. కుమారుడు, కూతురిలో వివక్ష లేకుండా పెంచాలనేందుకు తెచ్చిన ఈ పథకం.. సమాజంలో మార్పుకు కారణమైందన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment