తాజా వార్తలు

Monday, 16 May 2016

వైఎస్ జగన్ జలదీక్ష ప్రారంభం

కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం జలదీక్ష ప్రారంభించారు. వరుసగా మూడు రోజులు నిరాహారదీక్ష చేస్తారు. కర్నూలులో నంద్యాల రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలోని దీక్షావేదికపై దివంగత మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి దీక్షకు దిగారు.

ఈ రోజు ఉదయం  వైఎస్ జగన్ పులివెందుల నుంచి కర్నూలు బయల్దేరారు. పులివెందుల అమ్మవారి శాలలో ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు నగరం చేరుకోగానే జగన్నాథగట్టు వద్ద ఆయనకు వైఎస్ఆర్ సీపీ నేతలు బుట్టా రేణుక, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మురళి తదితరులు ఘనస్వాగతం పలికారు. వైఎస్ జగన్ జలదీక్షకు మద్దతుగా వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు పూర్తయితే తమ బతుకులు బుగ్గి పాలు అవుతాయనే ఆందోళన ఆంధ్రప్రదేశ్ రైతుల్లోనూ, ప్రజల్లోనూ నెలకొని ఉంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ప్రతిఘటించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నిష్క్రియాపరత్వంపై నిరసనను వ్యక్తం చేయడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా ప్రజల ఆక్రందనలను వినిపించేందుకు జగన్ ఈ నిరాహారదీక్షకు దిగారు.


« PREV
NEXT »

No comments

Post a Comment