తాజా వార్తలు

Thursday, 9 June 2016

అవినీతి ముందు అందరూ సమానులే!

మహారాష్ట్రలో రాజ్యానికీ రియల్‌ ఎస్టేటుకూ మధ్య అనుబంధం క్రమేపీ బలపడుతోంది. నిజానికి దేశమంతా ఇదే పరిస్థితి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్‌ చవాన భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఏ చట్టమైనా అమల్లోకి తీసుకురావటం ఎంత కష్టమో చెప్తూ వ్యక్తిగతానుభవాన్ని ఉదహరిస్తారు. ఒకసారి ఆయన ముంబైలో బహుళ అంతస్తుల పార్కింగ్‌, హై ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎ్‌సఐ) విషయంలో మరింత పారదర్శకతను కల్పించే ఉద్దేశంతో భూ నిబంధనలను మార్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రతిపాదన చర్చకు రాగానే మంత్రివర్గ సమావేశం అంతటా నిశ్శబ్దం రాజ్యమేలింది. ‘‘నా మంత్రివర్గ సహచరుల్లో కొందరు నేనేదో పాపం చేస్తున్నట్టు నావైపు చూడటం మొదలుపెట్టారు,’’ అన్నారు చవాన. ఈ స్పందన ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించదు: ముంబైలో బహుళ అంతస్తుల భవనాలపై అదనంగా వచ్చి చేరే ప్రతి అంతస్తూ ఆ బిల్డర్‌కూ, అతనికి రాజకీయంగా మద్దతిచ్చే నేతకు కొన్ని వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.
 
               చవాన్ లాగే ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా గౌరవప్రదమైన వ్యక్తి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఫడ్నవీస్‌ రాష్ట్రంలో అనేక భూ కుంభకోణాల్ని ఎత్తిచూపారు. ప్రభుత్వంలోకి వచ్చాక కూడా ఫడ్నవీస్‌ నిబద్ధతగల మనిషిగా తగిన పేరు సంపాదించుకున్నారు. అయితే వ్యక్తిగత నిజాయితీ ఉన్నంత మాత్రాన వ్యవస్థలో మార్పురాదని పూర్వ ముఖ్యమంత్రి లాగానే ఆయనకూ క్రమేపీ బోధపడుతోంది. గతవారం భూ ఆక్రమణ ఆరోపణలతో రాజీనామా చేసిన మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సే ఉదంతంతో ప్రభుత్వాలు మారినా కొన్ని దుస్సంప్రదాయాలు మాత్రం మారవని రుజువవుతోంది. అవినీతిపై ప్రధానమంత్రి పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటిస్తూ, ‘‘నేను తినను, ఎవర్నీ తిననివ్వను’’ (న ఖావూంగా, న ఖానేదూంగా) అని వాగ్దానం చేశారు. ఖతార్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, ‘‘అవినీతిపరులకు మిఠాయి దక్కనివ్వకుండా చేసినందుకే’’ తనను టార్గెట్‌ చేస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి ఉద్దేశాల్ని తక్కువమందే శంకిస్తారు:
 
                 ఆర్థికపరమైన అవినీతికి సంబంధించినంత వరకూ మోదీ కుర్తా పైజమాలకు ఇప్పటిదాకా ఏ మరకా అంటలేదు, అంతేగాక పదవుల్ని దుర్వినియోగం చేసేవారి మనసుల్లో కొంత భయాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కుతుంది. కానీ సీనియర్‌ బీజేపీ నేత, కొద్దిలో ముఖ్యమంత్రి పదవీ భాగ్యాన్ని కోల్పోయిన ఖడ్సేపై ప్రస్తుతం వస్తున్న అవినీతి ఆరోపణలకు మోదీ ఏం జవాబిస్తారు? ఖడ్సే ఉదంతం నుంచి గ్రహించాల్సినవి మూడు ఉన్నాయి. మొదటిది, పైస్థానంలో నిజాయితీగల వ్యక్తి ఉన్నంత మాత్రాన అతను నడిపే బృందమంతా నిజాయితీగానే ఉంటుందని చెప్పలేం. సంకీర్ణ ప్రభుత్వాల విషయంలో మంత్రివర్గ సహచరులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు చర్య తీసుకోవటం కష్టం. ఈ విషయాన్ని ఢిల్లీలో మన్మోహనసింగ్‌, ముంబైలో చవాన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇందుకే మహారాష్ట్ర మాజీమంత్రి ఛగన భుజ్‌బల్‌పై ప్రభుత్వం మారిన తర్వాత మాత్రమే చర్య తీసుకొని జైల్లో పెట్టడం జరిగింది. దీంతో పోలిస్తే కనీసం మోదీ, ఫడ్నవీ్‌సలు తమ సీనియర్‌ మంత్రిపై చర్యతీసుకోగల స్థాయిలో ఉన్నారు.
 
                  ఎందుకంటే ఆ చర్యల వలన ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి రాదని వారికి తెలుసు. అయినా నేటిదాకా ఖడ్సే చర్యలను బహిరంగంగా ఖండించేందుకు బీజేపీ సంశయించిందంటే, దీన్ని బట్టి రాజకీయ శక్తికి ఉన్న పరిమితులేంటో మనం అర్థం చేసుకోవచ్చు: ఒక బలమైన ఓబీసీ నేతగా ఖడ్సేకు ఉన్న స్థానం వల్ల ఆయన్ని తప్పుబట్టి కుల సమీకరణాల్లో నష్టపోయేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. 
రెండోది, రాజకీయంగా అందర్నీ సమతూకానికి తేవటంలో అవినీతికున్న శక్తి తిరుగులేనిది. బీజేపీ తాను కాంగ్రెస్‌ కన్నా ‘‘భిన్నమైన పార్టీ’’నని చెప్పుకోగలగటానికి వీలుకల్పిస్తున్నదల్లా కాంగ్రెస్‌ అంతకన్నా ఎక్కువ సంవత్సరాలపాటు అధికారంలో ఉండటమే. తిరుగులేని అధికారం కాంగ్రె్‌సను పాడుచేసింది, ఒకప్పటి గొప్ప వ్యవస్థను వేగంగా కుళ్ళిపోతోన్న కళేబరంగా మార్చింది. అందుకే బీజేపీ అవినీతిని బయటపెట్టినా కాంగ్రె్‌సకు ఒనగూరే ఆధిక్యత అంతంతమాత్రమే.
 
              అయితే, క్రమేపీ విశదం అవుతున్న విషయం ఏమిటంటే, అవినీతి ‘‘మిఠాయి’’ రుచి తెలిసేంత కాలంపాటు బీజేపీ అధికారంలో ఉన్న రాషా్ట్రల్లో, ఆ పార్టీ నేతలు కూడా వ్యక్తిగత లబ్ధి కోసం వ్యవస్థను మాయచేస్తూనే ఉన్నారు. మధ్యప్రదేశ, చత్తీ్‌సగఢ్‌, చివరకు మోదీ అనంతర గుజరాత రాషా్ట్రల్లో ఇటీవలి దృష్టాంతాల్ని బట్టి అవినీతి అనేది గుత్తగా కాంగ్రెస్‌ సొత్తే కాదనేది అర్థమవుతోంది. 
 
మూడోదీ, ముఖ్యమైనదీ ఏమిటంటే, దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు పెట్టుబడులు కూడబెట్టుకొనేందుకు భూమే ఇప్పటికీ ప్రధానమైన వనరు. స్వలాభానికి అనుకూలంగా భూ నిబంధనల్ని వక్రీకరించని అధికారపక్షం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. ఇందుకోసం తరచూ అవలంబించే మార్గం వ్యవసాయ భూమిని సేకరించి వ్యాపార వినియోగానికి అనుకూలంగా చేయటం. ఒక్క కలం పోటుతో వందలాది ఎకరాల విలువైన భూమి బిల్డర్లకు, పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి వస్తుంది. రాబడి నిష్పత్తి అమాంతం ఎన్నో రెట్లు పెరుగుతుంది. బహు లాభదాయకమైన ఈ పద్ధతిని దేశంలో అనేక పెద్ద మెట్రో నగరాల్లో పాటిస్తున్నారు. అది ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా ఏదైనా కావొచ్చు. 
 
                     రాజకీయనాయకుడు-బిల్డర్‌-బ్యూరోక్రాట్‌-అండర్‌వరల్డ్‌ ఈ వర్గాలు జట్టు కడితే ఒక నగరం పూర్తి స్వరూపాన్ని ఎలా మార్చేయగలవు అనేదానికి పూనె పెద్ద ఉదాహరణ. ఒకప్పుడు రిటైరైన వారి కలల ఆవాసమైన ఈ నగరం ఇప్పుడో కాంక్రీటు పీడకల. కొన్నేళ్ల క్రితం పూనె శివారు ప్రాంతమైన పింప్రి-చించ్వాడ్‌లో మున్సిపల్‌ అధికారులు ఏకంగా 66వేల అక్రమ భవనాలను కనుగొన్నారు. వాటిని కూల్చేందుకు ప్రయత్నించిన స్థానిక కలెక్టర్‌ త్వరలోనే బదిలీ అయ్యాడు. బిల్డర్లు రాజకీయ రక్షణ కోరగా ప్రభుత్వం ఆ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు తరలివచ్చింది. గొంతెత్తేందుకు ప్రయత్నించిన ఆర్టీఐ ఆందోళనకారుల్ని గూండాలు అడ్డుకున్నారు. మీడియాలో పరిశోధనాత్మక కథనాల్ని గుట్టుచప్పుడు కాకుండా పాతివేశారు. ఎనసీపీ నాయకుడు శరద్‌ పవార్‌ మేనల్లుడు అజిత పవార్‌ నగరంలో ఎదురులేని రాజకీయ శక్తిగా వెలిసాడు. పూనె మున్సిపల్‌ కార్పొరేషన సాక్షిగా రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీల మధ్య అనేక ‘‘అపవిత్ర’’ పొత్తులు కుదిరాయి.
 
                     ఒక్క పూనె మాత్రమే కాదు. గత ఏడాది నేను ఒక వేడుక సందర్భంగా ముంబై శివారు ప్రాంతం వాసాయి-విరార్‌కు వెళ్లాను. ముప్ఫై ఏళ్ల క్రితం అది ఒక మంచి పిక్నిక్‌ స్పాట్‌. అక్కడి దట్టమైన పచ్చటి అరటి తోటలు ఉక్కిరిబిక్కిరి చేసే నగర వాతావరణం నుంచి ఉపశమనం కలిగించేవి. 1989-90 సంవత్సరాల్లో ఇక్కడ జరిగిన అక్రమాల్ని బయటపెట్టిన విలేకర్ల బృందంలో నేనూ ఉన్నాను. ఈ ప్రాంతంలో వ్యవసాయ భూమిని ఎలా స్వాధీనం చేసుకొంటున్నారో, వివాదాలను సద్దుమణిగేట్టు చేయటానికి దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌ను ఎలా వాడుతున్నారో మేం బయటపెట్టాం. మా పరిశోధనల ఫలితంగా అప్పటి పవార్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కుప్పకూలే స్థితికి వచ్చింది. కొన్ని దశాబ్దాల అనంతరం, ఇప్పుడు, విచ్చలవిడిగా సాగుతున్న నిర్మాణ పనుల మధ్య ఆ ప్రాంతపు అరటి తోటలు దాదాపు మాయమయ్యాయి. ఇంకేం మారిందని అడిగాను ఒక స్థానిక విలేకరిని. ‘‘ఏముంది, అప్పట్లో మనం రచ్చకీడ్చిన నేతలంతా ఇప్పుడు ప్రైవేటు భవన నిర్మాణ సంస్థల్లో బిల్డర్లు లేదా పార్టనర్లు!’’ 
 
తాజా కలం: ఖడ్సేపై వచ్చిన ఆరోపణల్లో- ఫోన రికార్డుల ప్రకారం ఆయన దావూద్‌తో సంబంధాలు కలిగివున్నాడన్నది ఒక తీవ్రమైన ఆరోపణ. ఇవేమీ ఇంకా నిరూపణ కాలేదు. కానీ నేనొక చీకాకు పెట్టే ప్రశ్న అడగాలనుకుంటున్నాను- ఒకవేళ ఇలాంటి ఫోన రికార్డుల ద్వారానే దావూద్‌కు అసదుద్దీన ఒవైసీతోనో లేదా అజం ఖానతోనో సంబంధాలు ఉన్నాయని తేలితే? ఈ ‘‘జాతి వ్యతిరేక’’ కథనం అప్పుడెలా మారుతుంది?
« PREV
NEXT »

No comments

Post a Comment