తాజా వార్తలు

Thursday, 9 June 2016

వీణా-వాణి గతేమిటీ?

అవిభక్త కవలలు వీణా-వాణి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఆపరేషన్‌ చేస్తే ప్రాణాలకు ప్రమాదం అని ఎయిమ్స్‌ వైద్యులు చెప్పడంతో ఏదైనా పునరావాస కేంద్రంలో చేర్పించాలని నిలోఫర్‌ వైద్యుల సూచించడం.. తమ పిల్లలను సాకే శక్తి లేదని, ప్రభుత్వమే చూడాలని తల్లిదండ్రులు చెప్పడంతో వారి పరిస్థితి అయోమయంగా మారింది. వీణా-వాణిలను ఆపరేషన్‌ చేసి విడదీస్తే ప్రాణాలకే ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు చెప్పారు. ఒకవేళ ఆపరేషన్‌ తర్వాత వారు బతికినా కోమాలోకి వెళ్లే ప్రమాదమూ ఉందని తెలిపారు. దానికి వీణా-వాణిల తల్లిదండ్రులు లిఖితపూర్వక ఆమోదం తెలిపితే శస్త్రచికిత్స చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
 
దీనిపై ఆ కవలల తల్లిదండ్రులతో నిలోఫర్‌ ఆస్పత్రి వైద్యులు చర్చించారు. మొన్నటి దాకా 90 శాతం సత్ఫలితాలొస్తాయని చెప్పి.. ఇప్పటికిప్పుడు ప్రాణహాని అంటే ఏం చెప్పాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదారు రోజుల తర్వాత గానీ ఏ విషయం చెప్పలేమని తెలిపారు. కాగా, శస్త్రచికిత్సలో ఏమాత్రం పురోగతి కనిపించకపోవడంతో వారిని తల్లిదండ్రులు వద్దకు కానీ, ఏదైనా ఆశ్రమానికి కానీ పంపించే ప్రయత్నం నిలోఫర్‌ వైద్యులు చేస్తున్నారు. కాగా, తమ బిడ్డలు ఇద్దరూ బతకాలని, ప్రభుత్వమే సాయం చేయాలని వీణా-వాణి తండ్రి మురళీగౌడ్‌ కోరారు. కాగా, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ వద్ద చర్చిస్తానని ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment