తాజా వార్తలు

Thursday, 2 June 2016

‘అ.. ఆ’ రివ్యూ…

కథ:
అనసూయ(సమంత) మహాలక్ష్మి, రాంలింగం ల గారాల పట్టి. మొత్తం వారి ఆస్తికి తనే వారసురాలు. అనసూయకు మొదటి నుండి తన తల్లి మహాలక్ష్మి(నదియా) అంటే కొంచెం భయం. తండ్రి రామలింగం(నరేశ్) అంటే చాలా ఇష్టం. ఇంట్లో అనసూయకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఈలోపు మహాలక్ష్మి కంపెనీ పని మీద చెన్నై వెళ్లాల్సి వస్తుంది. పెళ్లి చూపులు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తుంది. ఆ పెళ్లి ఇష్టంలేక తన తండ్రితో కలిసి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యేలా చేస్తుంది అనసూయ. అమ్మ తిరిగి వచ్చేలోపు ఎక్కడైనా బయట ఊరుకి వెళ్ళి ఎంజాయ్ చేయాలని భావిస్తుంది. తన తండ్రి సహాయంతో అనసూయ తన మేనత్త ఇంటికి వెళ్తుంది. ట్రైన్ లో అనసూయకు తోడుగా తన మేనత్త కొడుకు ఆనంద్ విహారి(నితిన్)ను పంపిస్తాడు రామలింగం. అలా తన బావతో కలిసి ఊరుకి బయలుదేరిన అనసూయకు అక్కడి వాతావరణం బాగా నచ్చుతుంది. ఆనంద్ విహారి చేసిన అప్పులు తీర్చడం కోసం నాగవల్లి(అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయిని పెళ్లి చేసుకునే పరిస్థితి కలుగుతుంది. అనసూయ, ఆనంద్ ను ఇష్టపడడం మొదలుపెడుతుంది. తన తల్లికి తన మేనత్తకు మధ్య గొడవలు ఉన్నాయని తెలిసి
బాధ పడుతుంది. వారిద్దరి పెళ్లితో ఆ గొడవలు దూరమవుతాయనే ఆలోచనతో బావను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మరి అనసూయ అనుకున్నట్లుగా తన బావను పెళ్లి చేసుకుంటుందా..? అసలు ఇద్దరి కుటుంబాల మధ్య గొడవలకు గల కారణాలేంటి..? నాగవల్లి, ఆనంద్ ను దక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏంటి..? అనే అంశాలతో సినిమా నడుస్తుంది.

నటీనటుల పనితీరు:
ఆనంద్ పాత్రలో నితిన్ నటన సెటిల్ద్ గా ఉంటుంది. తల్లిని గౌరవించే కొడుకుగా, చెల్లెలు మీద ప్రేమ చూపించే అన్నాగా బాగా పెర్ఫార్మ్ చేశాడు. తను ప్రేమించిన అమ్మాయి దూరమవుతుందని తెలిసి బాధ పడే అబ్బాయి పాత్రలో నితిన్ అద్భుతంగా నటించాడు. అనసూయ పాత్రలో సమంత ఎప్పటిలానే తన నటనతో అందరినీ ఆకర్షించింది. అమాయకపు అమ్మాయిగా అందరినీ ఎంటర్టైన్ చేసింది. తన క్యూట్ లుక్స్ తో యూత్ ను ఆకట్టుకుంది. మహాలక్ష్మి గా నదియా నటన రొటీన్ గానే ఉంది. ‘అత్తారింటికి దారేది’,’బ్రూస్ లీ’ చిత్రాల్లో ఇలాంటి నటననే
కనబరిచింది. తండ్రి పాత్రలో నరేశ్ చక్కగా నటించాడు. ఇప్పటివరకు అనుపమ పరమేశ్వరన్ ను మలయాళం క్యూట్ హీరోయిన్ పాత్రల్లోనే చూశాం. మొదటిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. తను ప్రేమించిన అబ్బాయిని దక్కించుకోవడం కోసం ఆరాటపడే పాత్రలో పర్వాలేదనిపించింది. తెలుగులో మొదటి సినిమానే అయినా.. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. నాగవల్లి తండ్రి పాత్రలో రావు రమేశ్ మరోసారి మార్కులు కొట్టేశాడు. ఈ పాత్రలో తను తప్ప మరెవరూ సెట్ కారేమో అనే విధంగా ఆయన పెర్ఫార్మన్స్ ఉంటుంది. నితిన్ చెల్లెలుగా
అనన్య చక్కగా నటించింది. శకలక శంకర్, ప్రవీణ్, పోసాని కృష్ణ మురళి అక్కడక్కడా నవ్విస్తారు. అజయ్, శ్రీనివాస్ రెడ్డి, హరితేజ, శ్రీనివాస్ అవసరాల, రఘుబాబు, గిరి బాబు వారి పాత్రల
మేరకు చక్కగా నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకు పెద్ద ప్లస్ మిక్కీ జె మేయర్ మ్యూజిక్. ప్రతి పాట పరిస్థితులకు తగ్గట్లుగా ఉంటుంది. సినిమాలో మొత్తం పాటలన్నీ శ్రోతలను అలరిస్తాయి. సంగీతానికి తగ్గట్లుగానే చక్కని సాహిత్యం కుదిరింది. ‘ఎల్లిపోకే శ్యామల’,’మమ్మీ రిటర్న్స్’,’గోపాల గోపాల’ ఇలా ప్రతి పాట వినడానికి, చూడడానికి చక్కగా ఉంటాయి. నేపధ్య సంగీతం కూడా పర్వాలేదనిపిస్తుంది. నటరాజన్ ఫోటోగ్రఫి మరో ప్లస్. పచ్చని పొలాలు, చుట్టూ ఉండే వాతావరణం బాగా పిక్చరైజ్ చేశారు. ప్రతి ఫ్రేమ్ సింపుల్ గా చూడడానికి అందంగా ఉంటాయి. ప్రేక్షకులకు ఎంతవరకు అవసరమో అంతవరకే సినిమా ఉంటుంది. ఎడిటింగ్ కూడా ఓకే అనిపించింది. త్రివిక్రమ్ గొప్ప కథను ఎంచుకొని సినిమా తీయలేదు. సింపుల్ లవ్ స్టోరీకి కుటుంబ బంధాలను జోడించి చక్కగా తెరకెక్కించాడు. తను అనుకున్న కథను బాగా ప్రెజంట్ చేశాడు. స్క్రీన్ ప్లే పరంగా గొప్పగా లేకపోయినా.. ఓకే అనిపించింది. నిర్మాణ విలువలు బావున్నాయి.

విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో కుటుంబంతో కలిసి చూడగలిగే సినిమాలు అతి తక్కువగా వస్తున్నాయి. అందులో అ ఆ ఒకటి. కుటుంబంతో కలిసి చూసే ఆహ్లాదకరమైన సినిమా. చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు ఏ వర్గం వారైనా చూడగలిగే సినిమా. త్రివిక్రమ్ తన డైలాగ్స్ తో అదరగొట్టాడు. ప్రేమ కథను తను ప్రెజంట్ చేసిన విధానం అధ్బుతం. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ వే లో తను అనుకున్న కథను చెప్పాడు. సినిమా మొదటి భాగం సాగదీస్తున్నా ఫీలింగ్ కలిగినా.. సెకండ్ హాఫ్ లో మాత్రం స్క్రీన్ ప్లే కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. ఎక్కువ ల్యాగ్ పెట్టకుండా
ఉంటే సినిమా ఇంకా బావుండేది. సీన్, సీన్ కు ఏదో కథ చెప్తున్నట్లు సాగదీశారు. ఫైనల్ గా మాత్రం ఓకే అనిపించారు. తక్కువ కాస్టింగ్ తో తక్కువ బడ్జెట్ లో చక్కగా తీశారు. త్రివిక్రమ్
అంత రేంజ్ కాకపోయినా.. అ ఆ పర్వాలేదనిపించింది.
« PREV
NEXT »

No comments

Post a Comment