తాజా వార్తలు

Thursday, 30 June 2016

ఏపీకి రండి!

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఈ రంగంలో సుమారు రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చైనా పర్యటనలో భాగంగా ఐదో రోజున గుయాన్‌లో.. గిజో-ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో సీఎం బృందం పాల్గొంది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. చైనా ఆర్థిక సంస్కరణలను ప్రశంసించారు. ‘‘మూడు దశాబ్దాల్లోనే ఎంత అభివృద్ధి సాధించవచ్చో ప్రపంచానికి చేసి చూపించారు. ఆర్థిక సంస్కరణలను భారత కంటే ముందుగా ప్రవేశపెట్టి ఆసియాలో మార్గదర్శకంగా నిలిచారు. ఇరుదేశాల మైత్రికి ఎంతో ప్రాధాన్యముంది. భారతదేశంలో 500 చైనా కంపెనీలు నడుస్తున్నాయి. మేం మా రాష్ట్రాభివృద్ధి కోసం చైనా నుంచి పెట్టుబడులను, పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నాం. ఏపీలో పరిశ్రమలు స్థాపిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’’ అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో బౌద్ద పర్యాటక సర్క్యూట్‌ను ప్రభుత్వం అత్యున్నతంగా తీర్చిదిద్దుతోందని వివరించారు. ‘‘నవ్యాంధ్ర రాజధాని అమరావతి అంకుర దశలో ఉంది. ప్రపంచంలో ఎక్కడ అత్యుత్తమ విధానాలు అమలులో ఉంటే వాటిని తీసుకొచ్చి మా రాష్ట్రంలోని పరిస్థితులకు తగ్గట్టు అమలు చేస్తున్నాం. అమరావతిలో ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలను కల్పించాలని భావిస్తున్నాం’’ అని సీఎం వివరించారు. గిజో ప్రావిన్స్‌కూ.. ఆంధ్రప్రదేశకూ నడుమ సారూప్యాన్ని వివరిస్తూ సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగం చైనా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకొందని గిజో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మా లీ అన్నారు. 
 
బాబు దార్శనికత ఆదర్శనీయం
ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు రూపంలో సమర్థవంతమైన నాయకత్వం లభించిందని చైనా కమ్యూనిస్టు పార్టీ డిప్యూటీ సెక్రటరీ జోంగ్‌ వెన్‌ అన్నారు. చంద్రబాబు దార్శనికత ఆదర్శనీయమని ప్రశంసించారు. ప్రజల జీవన స్థితిగతులను మార్చడానికి ఆయన తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు. ఇండియా, ఏపీల్లో వ్యాపారావకాశాలకు ఇదే సరైన సమయని జోంగ్‌వెన్‌ అన్నారు. చైనా కంపెనీలు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గిజో - ఏపీ మధ్య సౌహార్థ సంబంధాలపై ఉభయుల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. కాగా, సీఎం బృందం తమ చైనా పర్యటన చివరి రోజున చైనా సంస్థలతో ఆరు ఒప్పందాలను చేసుకొంది. వాటి వివరాలు ఇవీ.. 
  • పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పవర్‌ చైనా గిజు ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌తో ఏపీ సర్కార్‌ ఒప్పందం చేసుకొంది. 
  • నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అయ్యేందుకు చైనా స్టేట్‌ కన్‌స్ట్రక్షన్‌ ఫోర్త్‌ ఇంజినీరింగ్‌ డివిజన్‌ ఏపీ సర్కార్‌తో ఒప్పందం చేసుకొంది. 
  • చైనాకు చెందిన సౌత హిటన్‌ సంస్థ మున్సిపల్‌ వాటర్‌ సప్లయ్‌, వేస్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి చూపింది. 
  • గిజు మేరిటైం సిల్క్‌ రోడ్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ కార్పొరేషన్‌ సంస్థ దొనకొండ వద్ద ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ పారిశ్రామిక పార్కులో పెట్టుబడులకు ముందుకు వచ్చింది. 
  • గిజు చాంగ్‌ తియూన్‌ ఎనర్జీ సేవింగ్‌ బిల్డింగ్‌ మెటీరియల్స్‌ సంస్థ అత్యాధునిక భవన నిర్మాణ సామాగ్రి తయారీ పార్కు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 
  • నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న ఏస్‌ డ్రిల్స్‌ రాక్‌ టూల్స్‌ సంస్థతోనూ ఏపీ సర్కార్‌ ఒప్పందం చేసుకొంది. 

నేడు జైట్లీతో చంద్రబాబు భేటీ 

న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ కానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జైట్లీ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో ఈ భేటీ జరగనుంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లోటు బడ్జెట్‌ భర్తీకి ఏపీకి కేంద్రం నిధులు, ఇతర నిధులపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతితో చంద్రబాబు భేటీ అవుతారు. ఇదిలా ఉండగా, చైనా పర్యటన ముగించుకొని బ్యాంకాక్‌ మీదుగా శుక్రవారం తెల్లవారుజామున సీఎం ఢిల్లీ చేరుకుంటారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి ఆయన విజయవాడ చేరుకొంటారు.
« PREV
NEXT »

No comments

Post a Comment