తాజా వార్తలు

Wednesday, 1 June 2016

టీఆర్ఎస్ పాలనలో బీసీలకు అన్యాయం

రెండేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో 52 శాతం జనాభా ఉన్న బీసీలకు ఒక్క కొత్త పథకం ప్రవేశపెట్టకపోగా ఇప్పటికే ఉన్న పథకాలకు మంగళం పాడే కుట్రలు చేస్తున్నారని వివిధ బీసీ సంఘాలు ఆరోపించాయి. పెట్టిన ప్రతి పథకంలోనూ బీసీల పట్ల వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తాయి. బుధవారం బీసీభవన్‌లో టీఆర్‌ఎస్ రెండేళ్ల పాలన పై బీసీల ‘చార్జీషీట్’ను ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేశ్, కుల్కచర్ల శ్రీనివాస్, సి.రాజేందర్, అశోక్‌గౌడ్, నీల వెంకట్ విడుదల చేశారు.

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం పేరుకే అసెంబ్లీలో తీర్మానం చేశారు కాని దాని అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేలేదని పేర్కొన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించలేదని, మూడుఎకరాల భూపంపిణీని బీసీలకు వర్తింపచేయలేదని, పారిశ్రామిక విధానంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సబ్సిడీలు ప్రకటించి బీసీలను విస్మరించారని, విదేశాల్లో ఉన్నతవిద్యకు ఆర్థిక సహాయంలోనూ బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక  విధానాలను అవలంబిస్తోందని 28 అంశాలతో చిట్టాను ప్రకటించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment